రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అనుచిత వైఖరి ఎందు కోసం

 

రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలలో ఎటు వైపు ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటే అటువైపు వారిని సముదాయించే విధంగా మాట్లాడుతున్నకాంగ్రెస్ అధిష్టానం, తనకి ఒక నిర్దిష్టమయిన ఆలోచన కానీ, స్పష్టమయిన వైఖరి గానీ లేదని నిన్న దిగ్విజయ్ సింగ్ చేసిన తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది.

 

హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగంగానే ఉంటుందని దానిపై సర్వ హక్కులు తెలంగాణాకే ఉంటాయని ఖరాఖండిగా చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, టీ-నోట్ పై క్యాబినెట్ ప్రకటన వెలువడిన తరువాత సీమంద్రాలో సమైక్యఉద్యమం హింసాత్మకంగా మారడం చూసి, ఇప్పుడు మాటా మార్చి హైదరాబాద్ పై అధికారాలు కేంద్రం లేదా గవర్నర్ చేతిలో ఉంటాయని ప్రకటించారు. తద్వారా సీమంద్రాలో ఉద్యమాలను చల్లార్చే ప్రయత్నంలో ఇప్పుడు తెలంగాణాలో అగ్గి రాజేశారు.

 

ఈవిధంగా ఒకసారి సీమంద్రాలో మరొకసారి తెలంగాణాలో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నకాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పరిష్కరించలేక, ఆ తప్పును ప్రతిపక్షాలపైకి నెట్టివేసి తన భాద్యత నుండి తప్పించుకోవాలని చూస్తోంది. ఇది చూస్తే ఒక అనుభవరహితుడయిన వైద్యుడు క్లిష్టమయిన ఆపరేషన్ చేస్తున్నట్లుంది. ఆ వైద్యుని చేతిలో రోగి ప్రాణాలు కోల్పోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా విషమించింది. అయినప్పటికీ దిగ్విజయ్ సింగ్ వంటి వారు రోజుకొక మాట మాట్లాడుతూ సమస్యను మరింత జటిలం చేస్తూనే ఉన్నారు.

 

సీమంద్రాలో విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో రైళ్ళు కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. అనేక జిల్లాలలో పట్టణాలు, గ్రామాలు కరెంటు లేక అంధకారంలో మునిగిపోయాయి. అదేవిధంగా ఇంతవరకు ఎంతో ప్రశాంతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం, కేవలం రెండు రోజుల్లో చాలా హింసాత్మకంగా మారింది. ఇంత జరుగుతున్నా తాము చేయగలిగిందేమీ లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, ఉద్యోగులకు నచ్చజెప్పే బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదేనని దిగ్విజయ్ సింగ్ ప్రకటించి చేతులు దులుపుకోవడం రాష్ట్ర ప్రజల పట్ల, నేతల పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి ఎంత చులకన భావం ఉందో తెలియజేస్తోంది.

 

అదే కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితి తలెత్తితే కాంగ్రెస్ అధిష్టానం ఆఘమేఘాల మీద కదిలి అక్కడి ప్రభుత్వాన్నికూల్చే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు చెలరేగినప్పుడు, ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హుటాహుటిన అక్కడికి తరలి వెళ్లి, భాదితులను పరామర్శించి సమాజ్ వాదీ ప్రభుత్వం వారికి సాయపడకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీలు గుప్పించి వచ్చారు.

 

కానీ గత రెండు నెలలుగా రాష్ట్రం అతలకుతలమవుతున్నా కనీసం కంటి తుడుపు చర్యగా వేసిన అంటోనీ కమిటీ సభ్యులు కూడా రాష్ట్రంలో పర్యటించాలని ఎన్నడూ అనుకోలేదు. రాష్ట్రంలో పరిస్థితులను కిరణ్ కుమార్ రెడ్డి (ఉద్దేశ్యపూర్వకంగానే) అదుపుచేయలేకపోతున్నట్లు భావిస్తున్నప్పుడు, మరి కేంద్రం ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? ఇప్పటికీ అతనిదే భాద్యత అని చెప్పడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశ్యం ఏమిటి?

 

కాంగ్రెస్ అధిష్టానం ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తే తన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం అది ఉద్దేశ్యపూర్వకంగానే ఈవిధంగా ప్రవర్తిస్తోందని అర్ధం అవుతోంది.