దిగ్విజయ్ డిప్రెషన్‌లో ఉన్నాడా..?

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం..నూట పాతికేళ్ల చరిత్ర కలిగిన పార్టీకి జనరల్ సెక్రటరీ..అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడేముందు వెనుకా ముందు ఎంత ఆలోచించాలి. కానీ అది ఏమాత్రం పట్టించుకోకుండా దిగ్విజయ్ తరచూ నోరు జారుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి విమర్శల పాలయ్యారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్‌సైట్ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారని, యువతను అలా రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం అధికారం ఇచ్చారా అంటూ డిగ్గీ రాజా చేసిన ట్వీట్ తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 

ప్రజలను కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశం కోసం పనిచేస్తున్న సైనికులు, పోలీసులపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతినేలా ఆయన మాట్లాడారని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ పోలీసులు..దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నారంటూ స్వయంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఉరి సైనిక స్థావరంపై దాడి జరిగినప్పుడు 19 మంది భారత సైనికులు అమరులైనప్పుడు సైనికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

 

అసలే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి గాలిలో దీపంలాగా ఉంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా చావు తప్పి కన్ను లోట్టపోయింది అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ వ్యవహారం. సరే దేశం సంగతి పక్కనబెడదాం..ఆయన గారు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే..ఏపీలో ఇప్పుడప్పుడే లేచే పరిస్థితి లేదు...తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఛాన్స్ రాకుండా చేస్తున్నారు కేసీఆర్. బలమైన క్యాడర్ ఉండి కూడా అక్కడ నిలబడలేకపోవడం హైకమాండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 

ఈసారి ఎలాగైనా పార్టీ పుంజుకునేలా చేసే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ చేతిలో పెడితే ఆయన ఇలా నోటి కొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ డిగ్గీరాజాను ఓ ఆట ఆడుకుంటోంది. తమ పోలీసులు నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఇవన్నీ చూసిన వారు రెండు రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా తీసేయడంతో దిగ్విజయ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని..ఆ బాధలోనే ఏది పడితే అది మాట్లాడుతున్నారని అంటున్నారు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ఇక నుంచైనా డిగ్గీరాజా ఆచితూచి మాట్లాడితే మంచిది.