కాంగ్రెస్ వైకాపాతో పొత్తులకి రంగం సిద్దం చేస్తోందా

 

రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ పార్టీపై మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముద్రని పూర్తిగా తుడిచిపెట్టేసి, కాంగ్రెస్ ముద్రని ఏర్పరచాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆయనను గొప్ప విలువలున్న వ్యక్తి అని పొగడటం, అనేక ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటూ జైలులో నిర్బందించబడిన జగన్ మోహన్ రెడ్డి ‘డీ.యన్.యే.’ కాంగ్రెస్ ‘డీ.యన్.యే.’ తో సరిపోలుతుందని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు చాలా అయోమయం చెందారు.

 

దిగ్విజయ్ సింగ్, ఈ మాటలను అనాలోచితంగా అన్నారో లేక రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అన్నారో తెలియదు కానీ, ఇంత కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆ తండ్రి కొడుకుల గురించి చెపుతున్న మాటలను ఆయనే స్వయంగా ఖండించినట్లు మాట్లాడి వారిని ఇబ్బందికరపరిస్థితులోకి నెట్టివేశారు. తద్వారా వారిప్పుడు జగన్ మోహన్ రెడ్డిని వేలెత్తి చూపలేని పరిస్థితి ఎదురయితే, ఇంత కాలం కాంగ్రెస్ నేతల దాడిని కాచుకోవడానికే సరిపోతున్న వైకాపాకు ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ మాటలు పట్టుకొని నిలదీసే అవకాశం వచ్చింది.

 

ఇక దిగ్విజయ్ సింగ్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాక్యాలు చేసి ఉంటే, వైకాపా విషయంలో కాంగ్రెస్ అధిష్టాన వైఖరిలో మార్పు వచ్చిందని భావించవచ్చును. రానున్న ఎన్నికలలో గెలిచి అధికారం సంపాదించుకొనేందుకు, ఎవరితోనయినా పొత్తులకు తమకు అభ్యంతరం ఉండబోదని ఆయన తన మాటలతో స్పష్టం చేసినట్లు భావించవచ్చును. తద్వారా కాంగ్రెస్ పార్టీలో నైతిక విలువలు కేవలం ఉపన్యాసాలకే పరిమితం తప్ప ఆచరణలో పాటించబోదని తేల్చిచెప్పారు.

 

నేటి రాజకీయాలలో ఇటువంటి ఆలోచనా ధోరణి సహజమేననుకొన్నపటికీ, ‘జగన్ డీ.యన్.ఏ. తమ డీ.యన్.ఏ. సరిపోలుతుందని’ చెప్పడం చూస్తే, తామందరం ఒక తానులో ముక్కలమేనని ఆయన నిసిగ్గుగా చాటుకోవడమే విడ్డూరం. ఏది ఏమయినప్పటికీ, నిన్న ఆయన చేసిన వ్యాక్యలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు లేదా విలీనానికి దారితీసే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికిప్పుడు ఆ రెండు పార్టీలు ఆ ప్రసక్తి తేకపోయినప్పటికీ రానున్న ఎన్నికల సమయానికి అందుకు తగిన వాతావరణం కల్పించే ప్రయత్నాలు మాత్రం త్వరలోనే మొదలుపెట్టవచ్చును.

 

అయితే, ఈ అనైతిక పొత్తులు లేదా విలీనానికి శ్రీకారం చుట్టాలంటే, అంతకంటే మున్ముందు అంతకంటే మరో అనైతిక పనికి కూడా కాంగ్రెస్ సిద్దపడక తప్పదు. అది తీవ్ర ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డిపై కేసులన్నీ ఎత్తివేసి, ఆయన నిర్దోషిగా చాటిచెప్పి జైలునుండి విడుదల చేయడం. జగన్ పై 5 చార్జ్ షీట్లు కూడా నమోదయిన ప్రస్తుత పరిస్థితుల్లోమరి కాంగ్రెస్ ఇంత సాహసం చేయగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే, అధికారం చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న కేసులనన్నిటినీ తెలివిగా నీరుగార్చినా ఆశ్చర్యం లేదు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల పరమార్ధం ఏమిటో త్వరలోనే క్రమంగా బయటపడవచ్చును.