దిగ్విజయ్ కొడుకు సెంటిమెంటుతో జగన్ బేజారు

 

“కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధము లేదని” ప్రజలకు నచ్చజెప్పుకొనేందుకు పాపం నానా తిప్పలు పడుతున్నజగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తనపై ఒలకబోస్తున్నఅవ్యాజమయిన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆయన ఘాటు ప్రేమను ఇక భరించలేక ‘అలా అన్నవాడిని చాచిపెట్టి చంపదెబ్బ కొట్టాలి’ అని కూడా అనవలసివచ్చింది.

 

కానీ, దిగ్విజయ్ సింగ్ మాత్రం అందుకు ఎంతమాత్రం నొచ్చుకోకుండా, గాంధీగారి సిద్దాంతాలు ఫాలో అయ్యే మనిషి గనుక ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తూ, “జగన్ తనను ఎన్నిమాటలన్నపటికీ అతని పట్ల తనకున్నపుత్రవాత్సల్యం చెరిగిపోదని, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా అతను నా కొడుకు వంటి వాడేనని, తమ డీ.యన్.యే.లలో కూడా ఎటువంటి మార్పు చెందబోవని” నిన్ననే ఆయన తాజాగా మరోమారు డిల్లీలో కన్ఫర్మ్ చేసారు. వద్దంటే ఇంతటి ప్రేమ కురిపించే దిగ్విజయ్ వంటి పెంపుడు తండ్రి దొరికినందుకు జగన్ బాధపడుతుంటే, అటువంటి తండ్రి ప్రేమకు నోచుకోనందుకు లగడపాటి వంటి చాలామంది కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారు. పోనీ దిగ్విజయ్ తన తండ్రి ప్రేమను అవసరమయిన వారందరికీ పంచిపెడితే కనీసం వారయినా శుభ్రంగా వాడుకొనేవారు కదా!