TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ సర్కార్ తో విభేదాలు- గవర్నర్ తమిళ్ సైకి ఉద్వాసన?!

Published on: Mon Apr 18, 2022 3:17PM

ప్రభుత్వంతో విభేదాలు తెలంగాణ గవర్నర్ తమిళసై మార్పునకు కారణమయ్యాయా? రాజ్ భవన్, ప్రభుత్వం మధ్యా అగాధం గవర్నర్ పదవికే ఎసరు పెట్టింది అని చెబుతున్నారు. కేంద్రం, తెరాస సర్కార్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కుతున్న నేపథ్యంలో గవర్నర్- ప్రభుత్వం మధ్య రిఫ్ట్ రాజకీయంగా తమకు నష్టం చేస్తుందన్న భావనతోనే కేంద్రం గవర్నర్ మార్పునకు మొగ్గు చూపిందంటున్నారు. బీజేపీ తమిళనాడు శాఖ ఉపాధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పని చేసిన తమిళసై  2019 సెప్టెంబర్ 1న తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు.

తెలంగాణ గవర్నర్ గా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి కౌశిక రెడ్డి నియామకంపై అభ్యంతరం చెప్పడం, అలాగే ప్రజా దర్బార్ పేరుతో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు కేసీర్ సర్కార్ తో విభేదాలకు కారణమయ్యాయి. దీంతో రాజ్ భవన్- ప్రభుత్వం మధ్య అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ తెరాస మంత్రులు ఆమెపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతున్న నేపధ్యంలో ఇటువంటి విమర్శలు రాజకీయంగా నష్టం చేస్తాయన్న భావన రాష్ట్ర బీజేపీ వర్గాలలోనే వ్యక్తమౌతున్న నేపథ్యంలో నష్ట నివారణకు ఆమెను మార్చడమే ఖాయమని బీజేపీ అధిష్టానం భావంచి ఆమెను మార్చేందుకు నిర్ణయించుకుందని అంటున్నారు.  

దీంతో  తెలంగాణ గవర్నర్ తమిళసై మార్పు ఖాయమన్న వార్తలు రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. స్వల్ప వ్యవధిలో ఆమె రెండో సారి హస్తి వెళ్లడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. పది రోజుల కిందట తమిళసై హస్తిన వెళ్లి నప్పుడు ఆమె ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె వారికి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని హస్తినలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ వెళ్లడించారు. తద్వారా అప్పటి దాకా రాజ్ భవన్- ప్రభుత్వం మధ్య అగాధమేర్పడిందన్నవి ఊహాగానాలు కావు పచ్చినిజాలని గవర్నర్ కుండ ద్దలు కొట్టేశారు. ఇప్పుడు మళ్లీ గవర్నర్ హస్తిన వెళ్లారు. ఒక ప్రజా ప్రతినిథి తనయుడి వివాహానికి వెళ్లినట్లు చెబుతున్నప్పటికీ హస్తిన పిలుపు మేరకేనని తెలుస్తోంది. 
ఈ సారి ఢిల్లీ పర్యటన తమిళసైని తెలంగాణ గవర్నర్ గా మారుస్తున్నట్లు తెలియజేయడానికేనని అభిజ్ణ వర్గాల భోగట్టా.తెలంగాణ కొత్త గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ లేదా, కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నసీనియర్ నేత కేసీ రామమూర్తిలలో ఒకరిని నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళసై తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి ఇన్ చార్జి గవర్నర్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే పుదుచ్చేరికి తమిళసైని పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు.  తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పని చేసిన తమిళసైకు ఆ రాష్ట్రంలో రాజకీయ పునరావాసం లభించే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. ఉపాధ్యక్షురాలిగా పని చేసిన ఆమె సహజంగానే అధ్యక్షురాలిగా ఎలివేషన్ కోరుకుంటారు. అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అన్నామళై సమర్ధంగా పార్టీని  నడుపుతున్న నేపథ్యంలో తమిళసైకి ఆ అవకాశం కూడా లేదని అంటున్నారు.