రవ్వంత నిప్పు రాజేశాడా? నిప్పురవ్వంతరెడ్డి

posted on: May 8, 2022 1:56PM

రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా హస్తినలోని హస్తం పార్టీ అధిష్ఠానం నియమించినప్పుడు.. తెలంగాణలో ఆ పార్టీలోని సీనియర్ నేతలు లేరా? అంటూ ప్రేమించుకుందా రా సినిమాలో హీరో వెంకటేష్‌ని.. అతని మేనకొడలు.. హైదరాబాద్‌లో ఆడపిల్లలు ఉండరా మామయ్య అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించినట్లు సదరు పార్టీలోని సీనియర్ నేతలను కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నించారట. దీంతో సదరు హస్తం పార్టీలోని నేతలకు మాత్రం కోపం కట్టలు తెంచుకొందట.   

రేవంత్ రెడ్డి.. సైకిల్ పార్టీ దిగి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించడంతో కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నేతల్లో బాగా  కాక రేగిందట. రేవంత్ చేరడం పార్టీలోని సీనియర్లకు అంతగా రుచించలేదట. ఆ తర్వాత పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. వారందరిని కాదని.. రేవంత్ రెడ్డికే టీపీసీసీ పగ్గాలు పార్టీ అధిష్టానం అప్పగించడంతో.. సదరు పార్టీలోని  సీనియర్లంతా లోలోన కుతకుతలాడిపోయారట.

అయితే రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పార్టీని కాంగ్రేసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారు. దీంతో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాదు రేవంత్ రెడ్డి వాగ్డాటికి, ఆయన రాజకీయ చతురతకి, పంచ్ డైలాగ్‌లకు తెలంగాణ సమాజం ఫిదా అయిపోయింది... అయిపోతోంది కూడా. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సభ ఎక్కడ  పెట్టిన.. ఎప్పుడు పెట్టినా.. ప్రజలు తండోప తండాలుగా ఇంకా చెప్పాలంటే తిరుణాలకు తరలి వస్తున్నట్లు వస్తున్నారు.  

అందుకు తాజాగా వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభే అందుకు సాక్ష్యం. ఈ  సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హాజరుకావడంతో.. తెలంగాణలోని హస్తం పార్టీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో ఊపు ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పోటీ చేసి.. ఉత్తర తెలంగాణలో హస్తం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే లక్ష్యంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిలో 8 స్థానాల్లో హస్తం పార్టీ తన సత్తా చూపుతోందని ఆ పార్టీ నేతలే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘర్షణ సభ విజయవంతం కావడమే అందుకు సాక్ష్యమని ఆ పార్టీలో ఓ చర్చ అయితే నడుస్తోంది.

రేవంత్ రెడ్డి పంచ్ డైలాగులతో పోటీ పడే మోనగాడు కారు పార్టీలో ఒక్కరు కూడా లేరని తెలంగాణ సమాజంలో ఓ చర్చ అయితే యమ జోరుగా సాగుతోంది. ఇంకో వైపు తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ ఎంత స్పీడ్ పెంచినా.. అదీ రేవంత్ రెడ్డి దూకుడు ముందు దిగదూడుపే అనే ఓ టాక్ అయితే టీఆర్ఎస్ భవన్‌లో అండర్ కరెంట్‌గా సాగుతోందని సమాచారం.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అయితేనేమీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అయితేనేమీ.. ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అయితేనేమీ ఎక్కడ కమలం పార్టీ విజయం సాధించినా.. ఈ ఉద్యమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ లైట్‌గా తీసుకుంటారని... అదే తెలంగాణలో ఎక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభ పెట్టినా.. సదరు సభకి సంబంధించిన అన్ని అంశాలపై అంటే.. సదరు సభలో రేవంత్ రెడ్డి డైలాగ్స్‌.. ఆ సభ సాక్షిగా ఆయన వాడిన భాష.... సభలో కేసీఆర్ అండ్ కోపై చేసిన ఆరోపణలు.. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ సంధించిన విమర్శనాస్త్రాలతోపాటు.. ఆ సభకు ఎంత మంది జనం తరలివచ్చారనే అంశాలపై ఈ గులాబీ బాస్.. ఇంటిలిజెన్స్ నుంచి ఓ నివేదికను సైతం తెప్పించుకుంటారనే గుసగుసలు సైతం ప్రగతి భవన్‌ సాక్షిగా నడుస్తోంది.    

ఈ నేపధ్యంలో రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతగా ఆయన్ని అణగదొక్కాలని ప్రయత్నించినా.. అంతగా రేవంత్ రెడ్డిపైకి లెస్తున్నారని.. ఒక రకంగా చెప్పాలంటే.. గోడకి కొట్టిన బంతిలాగా రేవంత్   వ్యవహరిస్తున్నాడని హస్తం పార్టీలోని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. అంతేకాదు కేసీఆర్ అండ్ కోకి రేవంత్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారారని.. సీఎం క్యాంప్ కార్యాలయంలో సైతం ఓ చర్చ అయితే చాలా హాట్ హాట్‌గా నడుస్తోందట.

అంతేకాదు.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రశాంత్ కిషోర్‌లు అవసరం ఉందేమో కానీ.. తమకు, తమ పార్టీకి అలాంటి వాళ్ల అవసరం లేదని.. తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు.. వారి ఆశీస్సులే తమకు శ్రీరామ రక్ష అని.. అవే తమను, తమ పార్టీని ఎన్నికల్లో విజయ తీరాలకు తీసుకు వెళ్తుందని.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు గతంలో పలు సభల్లో క్లియర్ కట్‌గా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  

అయితే కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమ వీరుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు రేవంత్ రెడ్డి దూకుడే కారణమనే ఓ చర్చ అయితే తెలంగాణ సమాజంలో హాట్ హాట్‌గా నడుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...