డయాబెటిస్‌ రావాలా వద్దా... మన చేతుల్లోనే!

 

ఒకప్పుడు షుగర్‌ అంటే బాగా డబ్బున్నవాళ్లకి వచ్చే జబ్బనుకునేవారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతూ కనిపిస్తున్నారు. వంశపారంపర్యంగా షుగర్ ఉంటే, ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే! ఎలాంటి శారీరిక శ్రమా లేని జీవనశైలి కూడా ఈ వ్యాధి త్వరగా వచ్చేందుకు ప్రేరేపిస్తుందని తెలిసిందే! కానీ మనకి డయాబెటిస్ రావాలా వద్దా అని నిర్ణయించడంలో మన ఆహారానిదే ముఖ్య పాత్ర అని సరికొత్త పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

 

స్వీడన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఆహారపు అలవాట్లకీ, డయాబెటిస్‌కీ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం గోధెన్‌బర్గ్‌ అనే పట్నంలోని 600 మందికి పైగా ఆడవారిని ఎంచుకున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల వ్యవధిలో, మూడు దఫాలుగా వీరందరి ఆహారపు అలవాట్లనీ గమనించారు.

 

సాధారణంగా ఒకరి వ్యక్తిగత ఆహారపు అలవాట్లని నిశితంగా నమోదు చేయడం కష్టమవుతుంది. అందుకని పరిశోధకులు, అభ్యర్థుల రక్తనమూనాలని సేకరించారు. ఈ రక్తనమూనాలలో ఉండే పోషకాలని గమనించడం ద్వారా, వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారో అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇలా ఒకొక్కరి నుంచి సేకరించిన నమూనా, వారి ఆహారాన్ని సూచించే వేలిముద్రలా (metabolic fingerprint) పనిచేస్తుందన్నమాట.

 

చేపలు, వంటనూనెలు, తృణధాన్యాలు, విటమిన్‌ ఈ కలిగిన పదార్థాలు ఎక్కువగా తినేవారిలో డయాబెటిస్ చాలా తక్కువగా వస్తున్నట్లు తేలింది. అదే మాంసం, కొవ్వు పదార్థాలు తినేవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం మెండుగా ఉన్నట్లు గ్రహించారు. అంటే మనం తినే ఆహారమే, భవిష్యత్తులో మనకి డయాబెటిస్ వస్తుందా రాదా అన్న విషయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నమాట.

 

ప్రపంచం మొత్తం మీదా డయాబెటిస్‌ ఎక్కువగా ఉండే దేశాలలో మనది రెండో స్థానం. మరో రెండు దశాబ్దాలలో మనదే మొదటి స్థానం అన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఆరుకోట్ల మందికి పైగా జనాభా డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. సాధారణంగా 40 ఏళ్ల వచ్చేసరకి డయాబెటిస్‌ లక్షణాలు కనిపించడం మొదలుపెడతాయట. కాబట్టి చిన్నవయసు నుంచే పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లని నేర్పిస్తే... భవిష్యత్తులో వారు డయాబెటిస్‌కు వీలైనంత దూరంగా ఉంటారు. పైన పేర్కొన్న పరిశోధనే ఇందుకు సాక్ష్యం.

- నిర్జర.