csk కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై.. జడేజాకు జట్టు పగ్గాలు..
Published on: Thu Mar 24, 2022 6:43PM
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్రసింగ్ ధోనీ. సీఎస్‌కే అంటే ధోనీ.. ధోనీ అంటే సీఎస్‌కే. ఎల్లో జెర్సీ జట్టును, ధోనీని కలర్‌ఫుల్‌గా మార్చేసింది. కెప్టెన్‌గా సీఎస్‌కేకు సంచలన విజయాలు సాధించిపెట్టాడు మహీ. ఐపీఎల్‌లో సీఎస్‌కే హవాకు ధోనీ కెప్టెన్సీనే కారణం. చెన్నై టీమ్ నాలుగుసార్లు కప్పు కొట్టడం ఎమ్ఎస్ వల్లే సాధ్యం.
అలాంటిది, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తన స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ఎప్పటిలానే ధోనీ జట్టులో కొనసాగుతాడు.
ధోనీ 2014లో ఆస్ట్రేలియా సీజన్ మధ్యలోనే ఒక్కసారిగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017లో పొట్టి ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆగస్టు 2020లో మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా, ఐపీఎల్ కెప్టెన్సీ నుంచీ వైదొలిగి.. ఫ్యాన్స్‌కు మరింత షాక్ ఇచ్చాడు.
ఇక, చెన్నై జట్టు కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా 2012 నుంచి సీఎస్‌కే తరఫున ఆడుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో మొహాలీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇరగదీశాడు. 175 రన్స్ చేయడమే కాకుండా 9 వికెట్లు కూడా పడగొట్టి.. సత్తా చాటాడు.


