ధోనీ రాక్షస సంహారం.. ‘అథర్వ ది ఆరిజిన్’ టీజర్ అదుర్స్.. ఫ్యాన్స్‌కి పండగే..
Published on: Thu Feb 3, 2022 1:23PM
ధోనీ ఏం చేస్తాడు? కీపింగ్ చేస్తాడు? బ్యాటింగ్ చేస్తాడు? యాడ్స్ చేస్తాడు? అంతేనే.. అంటే అంతకుమించి అంటున్నాడు. తాను రాక్షస సంహారం కూడా చూస్తానని కత్తి దూస్తున్నాడు. అసుర సమూహాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఇదంతా సినిమాలో. ఆ మూవీలో ధోనీనే హీరో. హీరో అంటే జీన్స్, టీషర్ట్స్ వేసుకునే మోడ్రన్ హీరో కాదు. ఆదిమ మానవుల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే సైంటిఫిక్ ఫిక్షన్. పేరు.. ‘అథర్వ ది ఆరిజిన్’. టీజర్ నిమిషాల్లోనే వైరల్ అయింది. ట్రైబల్ గెటప్‌లో ధోన్ లుక్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్.
చేతిలో కత్తి.. మెడలో పూసల గొలుసు.. మొలకు వస్త్రం.. కండలు తిరిగిన శరీరంతో.. ధోనీ సూపర్‌మేన్‌లా ఉన్నాడు. అయితే, ఇది సినిమా కాదు.. వెబ్‌సిరీస్. పూర్తిగా గ్రాఫికల్ ప్రజెంటేషన్.
‘అథర్వ ది ఆరిజిన్’ పేరిట సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే నవల (ఇంకా రిలీజ్ కాలేదు) ఆధారంగా దీన్ని అదే పేరుతో గ్రాఫిక్స్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. మహీ.. ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. టీజర్‌లో రెండు చేతుల్లో కత్తులను పట్టుకొని రాక్షసుల గుంపును సంహరిస్తున్నట్లు కనిపించాడు.
ఫస్ట్‌లుక్‌ను ధోనీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. రమేశ్ తమిల్‌మని అనే కొత్త రచయిత కథను సిద్ధం చేశారు. ధోనీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మాణ సంస్థ సహకారం అందిస్తోంది. ఇప్పటికే మహీ జీవిత కథతో ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడీ సైంటిఫిక్ ఫిక్షన్ వెబ్‌సిరీస్ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.


