TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. రేపు ప్రభుత్వ నిర్ణయం..?

Published on: Fri Jul 24, 2026 4:29PM

 

నీట్ పరీక్షల అక్రమాల వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు, సీజేపీ నాయకులకు మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా నిర్వహించిన ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 

సీజేపీ తరఫున జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరై తమ డిమాండ్లను స్పష్టంగా కేంద్రం ముందుంచారు.చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌పై స్పందించేందుకు ప్రభుత్వం రేపు మధ్యాహ్నం వరకు సమయం కోరిందని వెల్లడించారు. కేంద్రం నుంచి అధికారికంగా స్పష్టమైన నిర్ణయం వచ్చేంతవరకు విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

మరోవైపు పరీక్షల రసాభాస కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, ఆందోళనల సమయంలో విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, కేసులను పూర్తిగా ఎత్తివేయడంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, ఈ రెండు ప్రధాన డిమాండ్లకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సీజేపీ వెల్లడించింది. సీజేపీ నేతలు తమ ముందు మూడు ప్రధాన డిమాండ్లతో పాటు పరీక్షల విధానంలో సంస్కరణల కోసం ఐదు కీలక సూచనలు ఉంచారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 

వీటిపై ప్రభుత్వంలో అంతర్గతంగా సంప్రదింపులు జరిపి, రేపు మధ్యాహ్నం మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.పరీక్షల్లో జరిగే అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తూ బాధ్యులను త్వరితగతిన శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును త్వరలోనే కేబినెట్ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ హామీలతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై రేపు మధ్యాహ్నం కేంద్రం ఎలాంటి ప్రకటన చేయబోతోందనేది ఇప్పుడు రాజకీయ, విద్యార్థి వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.

Dharmendra Pradhan Resignation, NEET Exam Scam Controversy, JP Nadda CJP Talks, Cockroach Janata Party Demands, Union Education Minister Resignation