ధర్మాన చేరికతో వైకాపాకి ఓదార్పు

 

 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు సీబీఐ చార్జ్ షీట్లో ఎక్కడంతో తన మంత్రి పదవి కోల్పోవడమే కాక, ఇప్పుడు కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పడం లేదు. లోపం తనలో ఉంచుకొని, ఇంత కాలం తనకి ఉన్నత పదవులు కట్టబెట్టి పార్టీలో, సమాజంలో ఒక హోదా కల్పించిన కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చే నెల 7న వైకాపాలో జేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ స్వయంగా ప్రకటించారు.

 

సర్పంచే స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన ధర్మానకు ఆ సీబీఐ మరకలు అంటి ఉండకపోతే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవారు. ఇంకా ఉన్నత పదవులను కూడా పొందగలిగేవారని ఖచ్చితం చెప్పవచ్చును. అయితే మునిగిపోయే ఓడ వంటి కాంగ్రెస్ నుండి ఆశావహకంగా కనిపిస్తున్న వైకాపాలోకి దూకేసేందుకు ఇంత కంటే మంచి సాకు, సమయం వేరే ఉండవని భావించిన ధర్మాన త్వరలో ఆ పార్టీలోకి దూకనున్నారు.

 

తనకు జగన్మోహన్ రెడ్డి అండ దొరుకుతుందని ఆయన దైర్యం చేస్తుంటే, ఆయన రాక వలన శ్రీకాకుళం జిల్లాలో తమ పార్టీ మరింత బలపడుతుందని జగన్మోహన్ రెడ్డి సంతోషపడుతున్నారు. అయితే ధర్మానకు అతని అండ దొరకడం సంగతి ఎలా ఉన్నపటికీ, ఆయన చేరికతో జిల్లాలో పార్టీ బలపడటం ఖాయం.

 

రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ జిల్లాలో విభజనను సమర్దిస్తున్న కిల్లి క్రుపారాణి వంటివారి వలన మరింత బలహీనంగా తయారయింది. ఇప్పుడు ధర్మాన కూడా తప్పుకొని, ప్రత్యర్ధి వర్గంలో చేరిపోవడంతో, జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో అక్కడ తెదేపా కూడా చాలా బలహీనంగా ఉంది. ఈ పరిస్థితులన్నీ వైకాపాకు కలిసివచ్చే అంశంగా మారవచ్చును.

 

కానీ, వైకాపాకు ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమేనని ప్రజలు భావిస్తే ధర్మాన బలయిపోయే ప్రమాదం కూడా ఉంది.