కృష్ణదాస్ సవాల్ కు జవాబు ఇవ్వని ధర్మాన
Published on: Sat Mar 17, 2012 12:34PM
శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ధర్మాన కృష్ణదాస్ తన సోదరులపై విరుచుకుపడుతున్నారు. వారిపై సవాళ్ళవెంట సవాళ్ళు విసురుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు, రాష్ట్రమంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు కుయుక్తులతో తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని, డానికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కృష్ణదాస్ హెచ్చరిస్తున్నారు. మంత్రి ధర్మాన దమ్ముంటే తనపై పోటీ చేయాలని, అప్పుడు తన సత్తా ఏమిటో తెలుస్తుందని కృష్ణదాస్ అంటూ తన తమ్ముడు రామ్ దాస్ ను కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలబెడితే తనకు ఈ పోటీలో మజా ఉండదని అంటున్నారు. నాతో పోటీకి ధైర్యం ఉంటే ధర్మాన ప్రసాదే రంగంలోకి దిగాలని సవాలు విసురుతున్నారు. అలాగే తనపై అవాకులు చవాకులు పేలుతున్న ఎర్రంనాయుడు కూడా ఎవరో బలహీనుడ్ని తనపై నిలబెట్టే బదులు ఆయనే పోటీచేయాలని మరో సవాలు విసిరారు. ధర్మాన కృష్ణదాస్ ఒక సవాలు వెంట మరో సవాలు విసురుతూ తన తమ్ముళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే తమ్ముళ్ళు మాత్రం అన్నగారి సవాళ్ళను స్వీకరించడానికిగాని, సమాధానం చెప్పడానికిగాని ముందుకు రావడం లేదు.


