రంగంలోకి దిగిన ధర్మాడి బృందం... ఇనుప తాళ్లతో వశిష్ట ఆపరేషన్‌

 

గోదావరిలో ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది. మిగతా మృతదేహాల వెలికితీత కోసం హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే బోట్లతో గోదావరిని జల్లెడపడుతున్నారు. అయితే, 215 అడుగుల లోతులో బోటును గుర్తించిన ఎన్టీఆర్ఎఫ్... నదీగర్భంలో నుంచి దాన్ని బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ, సుడిగుండాల కారణంగా, 40 అడుగులకు మించి గోదావరి నదీగర్భంలోకి వెళ్లలేకపోతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. దాంతో బోటు వెలికితీత పెద్ద గందరగోళంగా మారింది. అసలేం చేయాలో తోచక ఎన్డీఆర్ఎఫ్ తలలు పట్టుకుంటోంది.

అయితే, బోటును బయటికి తీసేందుకు అన్ని ఆప్షన్స్ ను వినియోగించుకుంటున్న అధికారులు... బోట్లను వెలికితీయడంలో దిట్ట అయిన కాకినాడ ధర్మాడి సత్యం బృందాన్ని రంగంలోకి దింపింది. అలాగే, 100 టన్నుల బరువున్న బోటును సైతం బయటికి తీయగలిగే సామర్ధ్యమున్న భారీ ఇనుప తాళ్లను సిద్ధంచేశారు. ఇక, పోర్టుల్లో వినియోగించే బలమైన తాళ్లు, యాంకర్లు, డీలింక్‌లను ఉపయోగిస్తున్నారు. అలాగే, భారీ క్రేన్‌లను రప్పిస్తున్నారు. అయితే, 215 అడుగుల లోతులో ఉన్న బోటుకు యాంకర్లను తగిలించగలిగితేనే బయటికి లాగగలమంటోంది ఎన్టీఆర్ఎఫ్.