ధర్మపోరాట దీక్షకు వెళ్తున్న రైళ్లు నిలిపివేత

 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం హామీలను నెరవేర్చనందుకు నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ధర్మ పోరాట దీక్ష నిర్వహించనున్నారు. దీక్షకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, వామపక్షాల నేతలతోసహా 23 పార్టీల అధ్యక్షులు సంఘీభావం ప్రకటించనున్నారు.

ధర్మపోరాటదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 7గంటలకు రాజ్‌ఘాట్‌లో చంద్రబాబు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత ఏపీ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు.

ధర్మపోరాట దీక్షకు వెళ్తున్న రైళ్లను రైల్వే అధికారులు భోపాల్ వద్ద నిలిపివేశారు. దీంతో రైల్వే అధికారులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ధర్మ పోరాట దీక్షలో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిన్న రాత్రి రైళ్లల్లో బయలుదేరారు. అయితే.. ఈ రైళ్లను భోపాల్ దగ్గర రైల్వే అధికారులు నిలిపివేశారు. కాగా.. ఈ సమాచారాన్ని టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో.. రైళ్లకు అనుమతివ్వాలని ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ సంబంధిత రైల్వే అధికారులను కోరారు. ఆదివారం మధ్యాహ్నానికే రైళ్లు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా రాత్రి పది గంటలలోగా ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.