దేవీప్రసాద్ అలక!

 

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి, గొంతు నొప్పి పుట్టేలా అరిచిన పలువురు ఈసారి ఎన్నికలలో పోటీచేసి తమ అదృష్టాన్ని పరిశీలించుకోవాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారందరి ఫస్ట్ ఛాయిస్ టీఆర్ఎస్ పార్టీనే. ఆ పార్టీ ఇలాంటి వారిని అంతగాపట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. దాంతో చాలామంది ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారు. అలుగుతున్నారు. అలాంటి వారిలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ కూడా చేరారు. తెలంగాణ ఉద్యోగులలో విభజన కుంపటి రాజేయడానికి ఉద్యోగ సంఘాల నాయకులైన శ్రీనివాస్‌రెడ్డి, దేవీప్రసాద్ శాయశక్తులా కృషి చేశారు. ఉద్యోగులలో భావోద్వేగాలు పెరగడానికి వీరిద్దరూ శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వీరిద్దరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది. వీరిద్దరూ కూడా టీఆర్ఎస్ దత్త పుత్రుల మాదిరిగా తమవంతు సేవలు అందించారు.

 

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత మాత్రం టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాసరెడ్డిని అక్కున చేర్చుకుని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ అసెంబ్లీ టిక్కెట్‌ కూడా ఇచ్చేసింది. అప్పటి వరకూ అక్కడ పార్టీకి సేవ చేసిన ఇబ్రహీం అనే కార్యకర్తకి జెల్ల కొట్టి మరీ శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని, టీఆర్ఎస్ నుంచే తనకు ఆహ్వానం రావాలని కోరుకున్న దేవీప్రసాద్‌కి మాత్రం నిరాశే మిగిలింది. తన తోటి ఉద్యమకారుడు శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చి తనను ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో దేవీప్రసాద్ టీఆర్ఎస్ మీద అలిగినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్‌కి దత్తపుత్రుడిలా వ్యవహరించిన దేవీప్రసాద్‌ని ఇటు టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. మిగతా పార్టీలు కూడా దేవీ ప్రసాద్‌లో టీఆర్ఎస్ మనిషి కదా అని ఊరుకున్నాయి. దాంతో ఆయన పరిస్థితి ఇంటి కూటికి, బంతి కూటికి కూడా చెడినట్టు అయింది. దీనికి తగ్గ ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టుగా దేవీ ప్రసాద్ ఈ ఎన్నికలలో ఉద్యోగ సంఘాలు ఏ పార్టీని సమర్థించవని ప్రకటించారు. ప్రస్తుతం దేవీప్రసాద్ అలక తీర్చే బాధ్యత కేసీఆర్ మీదే వుంది.