వైఎస్ జగన్‌పై దేవినేని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన రోజే జగన్ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల కోసం ప్రయత్నించారన్నారు. అయితే, కాంగ్రెస్ పెద్దలతో బేరం కుదరకపోవడంతో.. ఆ టెండర్లను జగన్ దక్కించుకోలేకపోయారని ఆరోపించారు. జగన్, విజయసాయిరెడ్డిలు పోలవరం ప్రాజెక్ట్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. పనులు ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్‌లపై విమర్శించే నైతికత జగన్‌కు లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటి వరకు రూ. 12,800 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 2018 చివరి నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు ప్రకాశానికి వస్తుందని దేవినేని అన్నారు. జనవరి రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారని తెలిపారు.