చెప్పన్నా చెప్పన్నా అంటున్నారు...ఏం ఖర్మ పట్టిందో?

 

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావేదిక ఇప్పుడు వివాదాలకి కారణంగా నిలుస్తోంది. గత ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఈ నిర్మాణాన్ని నిర్మించిందని నిషిద్ద ప్రాంతంలో నిర్మించడమే కాక టెండర్ లను కూడా పిలవకుండా మంత్రి నారాయణ తనకు కావాల్సిన వారికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించారనేది వైసీపీ ఆరోపణ. అయితే అక్రమ నిర్మాణం కాబట్టి దాన్ని కూలగొడతానని చెప్పిన జగన్ చెప్పినట్టుగానే ఈరోజు ఉదయానికి నేల మట్టం చేశారు. 

ఈ విషయం మీద మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రజావేదిక విషయంలో ప్రవర్తించిన తీరును తప్పు పట్టిన ఆయన ప్రజావేదిక ప్రజల సొమ్ముతో కట్టిన నిర్మాణం అని దాని రక్షకుడిగా ఉండాల్సిన జగన్ జోరు వానలో కూడా అధికారులను మోహరించి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ 2లో వైఎస్ ప్రతిపక్ష నేతగా, సీనియర్ శాసనసభ్యుడిగా తన కుటుంబంతో కలిసి ఉండేవారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి షబ్బీర్ అలీ దాన్ని క్రమబద్ధీకరణ చేశారని ఇక ఆ తర్వాత లోటస్ పాండ్ లో ఇల్లు కట్టిన వైఎస్ జగన్ దాన్ని రాజ్ టవర్స్ గా మార్చి పెద్ద కాంప్లెక్స్ కట్టి బ్యాంకులు, కంపెనీలకు అద్దెలకు ఇచ్చారని అన్నారు. అదొక్కటే కాక లోటస్ పాండ్ దగ్గర కూడా చెరువు భూములను ఆక్రమించి నిర్మాణం చేసుకుని ఆ తర్వాత దానిని కూడా ప్రభుత్వ అండతో రెగ్యులరైజ్ చేయించుకున్నారని కానీ ఇక్కడకి వచ్చిన ఆయన నీతులు చెబుతున్నారని విమర్శించారు. 

ఇక పోలవరం విషయంలో కూడా అయన మాట్లాడుతూ పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పాలని అధికారులను బతిమలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక అసలు పోలవరంలో పునాదులు తప్ప ఏమీ జరగలేదని చెబుతున్న జగన్ అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇక తన మీద ట్విట్టర్ లో విమర్శలు చేస్తున్న విజయసాయి రెడ్డిని ఉద్దేశించి కూడా అయన కీలక వ్యాఖ్యలు చేశారు. బినామీ బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి పదహారు నెలలు జైలులో ఉన్న వ్యక్తికి ఈరోజు కాలం కలిసి ఢిల్లీలో క్యాబినెట్ హోదా వెలగబెడుతూ తనను దొంగ అంటున్నారని విమర్శించారు. నా ఖర్మ నీతో నీతులు చెప్పించుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.