ప్రేమ ఉంటే ఉండవల్లి, కేవీపీ వైసీపీలో చేరండి
Published on: Wed May 8, 2019 11:37AM

కేసీఆర్, జగన్ డైరెక్షన్‌లో.. పోలవరం పనులు ఆపాలని ఎంపీ కేవీపీ రామచ్రందరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి, కేవీపీల అనుమానాలు నివృత్తి చేయడానికి ఇరిగేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్, కవిత పోలవరానికి వ్యతిరేకంగా పిటిషన్‌లు వేసినప్పుడు కేవీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన దేవినేని.. రాజమండ్రి కొట్టుకు పోతుందని కొంతమంది అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీపై ప్రేమ ఉంటే ఉండవల్లి, కేవీపీలు ఆ పార్టీలో చేరొచ్చని.. కానీ ప్రజలను పక్కదారి పట్టించొద్దని సూచించారు. కేవీపీ.. వైఎస్‌కు ఆత్మ, కేసీఆర్‌కు ఆత్మ బంధువు అని ఎద్దేవా చేశారు.
‘‘పోలవరం పనులన్నీ వేగవంతం చేయడానికి సీఎం క్షేత్ర స్ధాయి పర్యటన నిర్వహిస్తున్నారు. 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అప్పర్ కాపర్, లోయర్ కాపర్ డ్యాం నిర్మాణాలు వేగవంతం చేయాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 500 మంది ఇంజినీర్లు డ్యాం సైట్లో పనిచేస్తున్నారు. కొన్ని వందల మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. నిపుణులు, ఇంజినీర్లు సమక్షంలో పనులు సాగుతున్నాయి." అని దేవినేని ఉమా పేర్కొన్నారు.
భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం జగన్ నోరు విప్పరు. వైఎస్ హయాంలో లబ్ధి పొందిన వారంతా అక్కడ టీఆర్‌ఎస్‌లో.. ఇక్కడ వైసీపీలో చేరారని ఉమా ఆరోపించారు. దేవాలయాలు మునిగిపోతాయని చెబుతున్న కేసీఆర్ ఆనాడు ఏంచేశారు? ఏదో రకంగా పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు అని మండిపడ్డారు.
జగన్ కనుసన్నల్లో ఇక్కడ రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ నాటకాలాడుతున్నారని ఉమా ఆరోపించారు. కోట్ల మంది ప్రజలు, రైతుల గుండె చప్పుడు పోలవరం. అనవసరంగా ప్రాజెక్టు జోలికి రావొద్దు అని హెచ్చరించారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా.. పోలవరం అంత వేగంగా ఎక్కడా పనులు సాగడం లేదు అన్నారు.
23న వచ్చే ఫలితాలతో వైసీపీ దుకాణం మూతపడుతుందని అన్నారు. పోలవరానికి రావలసిన నిధులను రేపు కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం నుంచి సాధించుకుంటామని తెలిపారు. జాతీయ ప్రాజెక్టును ఒక్కసారైనా ప్రధాని, ప్రతిపక్ష నేత, విజయసాయిరెడ్డి వచ్చి చూసారా? అని ప్రశ్నించారు. పోలవరానికి సంబంధించి ఎవరికి ఏ సమాచారం కావాలన్నా ప్రాజెక్టు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ప్రాణాలకు తెగించి కార్మికులు పనులు చేస్తుంటే రాళ్లేయడం ఎంతవరకు సబబు? పోలవరంపై విషం చిమ్మే ప్రయత్నాలు మానుకోండి అని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.


