జగన్ సీఎం నేమ్ ప్లేట్.. పిచ్చికి పరాకాష్ఠ

 

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు చాలా రోజులు సమయముంది. కానీ వైసీపీ మాత్రం అధికారం తమదేనని, జగనే సీఎం అని ధీమాగా ఉంది. కొందరు వైసీపీ కార్యకర్తలైతే 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి' అని నేమ్ ప్లేట్ కూడా తయారు చేయించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిపై దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ టీం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమల్లో ఉంచుతోందని, జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ఠ అని మండిపడ్డారు.

 

 

సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమ.. జగన్ మీద విమర్శలు గుప్పించారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌లు కుట్రలు చేసి గెలవాలని చూశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశాంత్‌కిషోర్‌ కుట్రలకు వైసీపీ రూ. 300 కోట్లు ఖర్చు చేసిందని.. అయినా టీడీపీ గెలవబోతోందని ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌లో సిబ్బందే చెప్తున్నారని  అన్నారు. పోలింగ్‌శాతం తగ్గించేందుకు వైసీపీ చేసిన కుట్రలు ఫలించలేదన్నారు. వృద్ధులు, మహిళలు వైసీపీ కుట్రలను తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కష్టానికి ప్రజలు ఓటు రూపంలో తీర్పు ఇచ్చారన్నారు. గ్రామాల్లో గొడవలు చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

రాజధానిలో రూ. 50 వేల కోట్లు పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పోలవరంలో 70 శాతం పనులు పూర్తయితే పునాదులు వెయ్యలేదని జగన్‌ మాట్లాడారని, ఒక్కసారి కూడా జగన్‌ రాజధాని, పోలవరాన్ని సందర్శించలేదని ఆయన ఆరోపించారు. పోలవరం ఆపేందుకు కేసులేసిన కేసీఆర్‌, కవిత జగన్‌కు ముద్దయ్యారని మండిపడ్డారు.

ఈవీఎం లోపాలపై ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు పోరాడుతున్నారని అన్నారు. హరిప్రసాద్ పై కేసులను సాకుగా చూపి ఈసీ తప్పించుకుంటుందని విమర్శించారు. హరిప్రసాద్ దశాబ్దకాలంగా ఈవీఎంలలో జరుగుతున్న లోపాలను పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు చెబుతున్నారని.. దానిపై పెట్టిన కేసును అడ్డం పెట్టుకుని.. అతనిపై కేసు ఉందని.. ఆయన వాదనను వినమని ఈసీ చెబుతోందని.. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. 13 సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఈసీకి లేఖలు రాస్తున్నాడని, వెంటనే ఆదేశాలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. 31 క్రిమినల్ కేసులు ఉన్న జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారని మండిపడ్డారు. ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది దేవుడు నిర్ణయిస్తారన్న జగన్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.