దేవినేని కుటుంబంలో చిచ్చుపెట్టిన జగన్
Published on: Sat May 12, 2012 10:34AM
ఎన్నికల నగారా మొగకనుందు నుంచే రాజకీయ వలసలు ప్రారంభమవుతాయి. అయితే ఈ వలసలు ఎలా ఉంటాయో చేరికలు పూర్తయ్యేవరకూ లెక్కకట్టలేం. అటువంటి వలస మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఈయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఈయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తామిద్దరి మధ్య వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చిచ్చుపెట్టారని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా వలస వెళ్ళాలని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకుడు వై.వి.సుబ్బారెడ్డి తన తమ్ముడికి చెప్పి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తన సోదరుడు ఉమతో ఎటువంటి విభేదాలు లేవనీ, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరవచ్చని దేవినేని చంద్రశేఖర్ తెలిపారు. తాను జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది సహజమేనని చంద్రశేఖర్ సర్దిచెప్పారు. కానీ, ఎమ్మెల్యే ఉమా మాత్రం తనను మూడుసార్లు ఎమ్మెల్యే చేసిన తెలుగుదేశంపార్టీ కోసం అవసరమైతే సోదరుడిని వదులుకుంటానన్నారు. ప్రత్యేకించి జగన్ ను జైలుకు పంపేంత వరకూ ఆయనపై అవినీతి పోరాటం చేస్తానని ఉమా హెచ్చరించారు.


