టీడీపీలోకి వంగవీటి.. వైసీపీలోకి దేవినేని!!

 

వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. గతంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వంగవీటి, దేవినేని కుటుంబాలు.. ఇప్పుడు టీడీపీలోనూ అదే రకమైన రాజకీయ ప్రయాణం చేయబోతున్నాయి.

అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. దీంతో విజయవాడలో వంగవీటి రంగా వర్సెస్ దేవినేని నెహ్రూ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. వంగవీటి రంగా హత్యానంతరం విజయవాడ రాజకీయాలు మారిపోయాయి. రంగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన ఆయన కుమారుడు రాధా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు అప్పట్లో టీడీపీలో ఉన్న దేవినేని నెహ్రూ.. సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ గొడుగు కిందకు వచ్చాయి. ఒకే పార్టీలో ఉన్నా ఈ రెండు కుటుంబాల మధ్య మర్యాదపూర్వకంగా కూడా మాటలు ఉండేవి కావు. అయినా ఈ రెండు కుటుంబాలను కాంగ్రెస్ అప్పట్లో బాగానే బ్యాలెన్స్ చేసింది. తరువాత ఆ అవసరం లేకుండా పోయింది. 2009లో వంగవీటి రాధా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దేవినేని నెహ్రూ మాత్రం 2014 వరకు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2014 తరువాత దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్ టీడీపీలో చేరారు. అనారోగ్యం కారణంగా కొన్నాళ్ల క్రితం దేవినేని నెహ్రూ చనిపోగా.. ప్రస్తుతం ఆయన తనయుడు అవినాష్ టీడీపీలో ఉన్నారు. రీసెంట్ గా చంద్రబాబు అవినాష్ ని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా నియమించారు.

అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా కూడా టీడీపీలో చేరబోతుండటంతో.. ఈ ఇరువురు టీడీపీలో ఎలా ఇముడుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. మాటలు లేకపోయినా నాడు కాంగ్రెస్‌లో ఎలాగోలాగ సర్దుకుపోయిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు.. నేడు టీడీపీలో అదే రకంగా సర్దుకుపోతారా అంటూ చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు ఇప్పుడొక సంచలన వార్త విజయవాడ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. రాధా రాకను అవినాష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. రాధా టీడీపీలో చేరితే, తాను టీడీపీని వీడుతా అని అవినాష్ సన్నిహితుల వద్ద చెప్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇప్పటికే వైసీపీ రంగంలోకి దిగి అవినాష్ కి విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ లోటుని దేవినేని ఫ్యామిలీతో భర్తీ చేయాలని వైసీపీ భావిస్తోందట. మొత్తానికి రాధా టీడీపీలో చేరిన వెంటనే అవినాష్ వైసీపీలో చేరతారని వార్తలొస్తున్నాయి. అయితే అవినాష్ వైసీపీలో చేరతారు అని వస్తున్న వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. టీడీపీ అవినాష్ కి తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించింది, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి రాధా టీడీపీలో చేరుతున్నారని.. అవినాష్ తనకు తగిన గుర్తింపు ఇస్తున్న టీడీపీని వీడి వైసీపీలో చేరతారా? లేక గతంలో వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ లో సర్దుకుపోయాయి కదా అని టీడీపీలోనే కొనసాగుతారో చూడాలి.