అంచనాలను తలకిందులు చేసిన ఫడ్నవిస్... మరాఠా రాజ్యంలో దేవేంద్రుడి ముద్ర...

 

యువకుడు... పైగా అనుభవం లేదు... మరోవైపు శివసేన పోరు... ఇంకోవైపు సీనియర్ల ఆధితప్యం... ఇన్ని అడ్డంకులు అవరోధాల మధ్య... ప్రభుత్వాన్ని నడపడం అతనికి చేతగాదని అంచనా వేశారు. ముఖ్యంగా శివసేన పోరు పడలేక మధ్యలోనే పారిపోతాడని లెక్కకట్టారు. విపక్షాలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా చాలా తక్కువ అంచనా వేశారు. కానీ, వారందరి అంచనాలను దేవేంద్రుడు తలకిందులు చేశాడు. ప్రాంతీయ పార్టీల అధినేతల మాదరిగా మరాఠా ప్రజలపై బలమైన ముద్ర వేశాడు. ఒక్క అవినీతి మరకా అంటకుండా పరిపాలన సాగించాడు. ఎలాంటి సమస్య వచ్చినా ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొని పరిష్కరించాడు. అంతేకాదు పక్కలో బల్లెంలా మారిన శివసేనను సైతం దారిలోకి తెచ్చుకుని రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాడు. అందుకే మహారాష్ట్ర ప్రజలు మళ్లీ దేవేంద్రుడికే పట్టం కట్టారని ఎగ్టిట్ పోల్స్ అన్నీ తేల్చిచెప్పాయి.   

ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లు బీజేపీకి ఆయువుపట్టుగా నిలిచాయని ఎగ్జిట్ పోల్స్ లెక్కగట్టాయి. మహారాష్ట్ర జనాభాలో 30శాతమున్న మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ అత్యంత సాహసంగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో... మెజారిటీ మరాఠాల ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని తేల్చాయి. అందుకే, మరాఠా కాంగ్రెస్‌ పార్టీగా చెప్పుకునే, ఎన్సీపీని సైతం పక్కనపెట్టి మరాఠాలంతా ఏకపక్షంగా బీజేపీకి సై అన్నారని సర్వే సంస్థలు అంటున్నాయి. ఇక, మోడీ-షా మాయాజాలం ఎలాగూ ఉంటుంది. అలాగే బీజేపీకి పేటెంట్ గా మారిన జాతీయవాదం, హిందూత్వం కూడా మరోసారి మహారాష్ట్ర పీఠం దక్కించుకునేందుకు దోహదపడబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఇక, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను... మరోసారి మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. రాహుల్ అధ్యక్ష పీఠం దిగినా, సోనియా అధిరోహించినా, కాంగ్రెస్‌పై ఏమాత్రం సానుభూతి చూపలేదని తెలుస్తోంది. అలాగే, ఎన్సీపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌ను మాత్రం మరాఠాలు చేరదీయలేదని అంచనా వేశాయి.