TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ ఏ తండ్రి కొడుకని అడిగామా?

Published on: Sat Feb 12, 2022 3:01PM

కొంద‌రు రాజకీయ నేతలు కట్టుతప్పి కటువుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసోం సీఎం హిమంత విశ్వశర్మ. రాహుల్ ఏ తండ్రి కుమారుడని తాము ఎప్పుడైనా రుజువులు అడిగామా? అని హిమంత విశ్వశర్మ ప్రశ్నించారు. విశ్వశర్మ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. 

ఉత్తరాఖండ్ లోని కిచ్చలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో హిమంత విశ్వశర్మ మాట్లాడుతూ రాహుల్ పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ నేతృత్వంలో 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పై రాహుల్ గాంధీ రుజువులు అడిగారని చెబుతూనే.. రాహుల్ తండ్రి ప్రస్తావన తెచ్చారు. రాహుల్ ఏ తండ్రి కొడుకో తాము ఎప్పుడైనా రుజువులు అడిగామా అని విశ్వశర్మ ప్రశ్నించారు. ‘సర్జికల్ స్ట్రైక్స్ పై సాక్ష్యాధారాలు అడిగే హక్కు కాంగ్రెస్ కు ఎవరిచ్చారు? పాకిస్తాన్ భూభాగాల్లోకి ప్రవేశించి దాడులు చేశామని మన సైనికులు స్పష్టం చేశారు. సైనికులు చెప్పిందే ఫైనల్’ అని హిమంత విశ్వశర్మ అన్నారు.

దాంతో పాటుగా కర్ణాటక విద్యా సంస్థల్లో కొద్ది రోజులుగా అట్టుడికిపోతున్న హిజాబ్ వివాదంపైనా హిమంత విశ్వశర్మ స్పందించారు. ముస్లిం విద్యార్థినులకు విద్య అవసరమని, హిజాబ్ కాదని వ్యాఖ్యానించారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులు విద్యపై శ్రద్ధ పెడుతున్నారో లేదో టీచర్లకు ఎలా తెలుస్తుందని హిమంత ప్రశ్నించారు. హిజాబ్ కావాలని మూడేళ్ల క్రితం విద్యార్థులు కోరలేదని, ఇప్పుడు ఈ వివాదం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఈ వివాదానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని హిమంత దుయ్యబట్టారు. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల యత్నం అని మండిప‌డ్డారు. 

టుక్డే టుక్డే గ్యాంగ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్.. దేశం కాదు.. రాష్ట్రాల కలయిక అని రాహుల్ గాంధీ అంటారు. కాంగ్రెస్ వాళ్లలో భారతదేశం నుంచి పాకిస్తాన్ ను విడగొట్టించిన జిన్నా ఆత్మ ప్రవేశించిందేమో అనిపిస్తోందని హిమంత విశ్వశర్మ ఎద్దేవా చేశారు. ముస్లిం విద్యార్థులు డాక్టర్లు కావద్దని, వారు ఇంజనీర్లుగా ఇతర ఉన్నత స్థానాల్లో ఉండొద్దనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అనిపిస్తోందని హిమంత దుయ్యబట్టారు.