టీడీపీకి షాక్...అసెంబ్లీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

 

ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభం నుంచి సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌, పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తగా సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. 

ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు అడ్డు పడ్డారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూర్చోవాలని ఎంతగా చెప్పినా వినకపోవడంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడిని సస్పెండ్ చేయాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని వెంటనే సభ ఆమోదించగా డిప్యూటీ స్పీకర్ వెంటనే వారిని బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. 

తమను సస్పెండ్ చేయడం అన్యాయమని ముగ్గురు సభ్యులు సభలో కూర్చోగా మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తరలించారు. సస్పెండ్ అయిన ముగ్గురు సభ్యులు టీడీపీ శాసన సభాపక్ష ఉపనాయకులే కావడం గమనార్హం. ముగ్గురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. సభ నుంచి సస్పెన్షన్‌కు గురైనా ముగ్గురు ఎమ్మెల్యేలు సభలోనే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించిన సభ్యులను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. 

ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీల విస్మరించడం, తదితర అంశాలను ప్రశ్నిస్తున్నందునే తమను సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు తీసుకొచ్చిన వీడియోలను చూపించిన స్పీకర్, తాము తీసుకొచ్చిన వాటిని కూడా చూపించాలని డిమాండ్ చేశామని అన్నారు. సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇరు పక్షాల వీడియోలు చూసిన అనంతరం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారంటే దానికి కూడా స్పీకర్ అంగీకరించలేని తను అసలు తన ప్లేస్ నుండి కదల్లేదని, అసభ్యంగా మాట్లాడలేదని అలాంటి తనను కావాలనే సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.