TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రప్పా.. రప్పా.. అంటే చూస్తూ కూర్చుంటామా?

Published on: Wed Jul 23, 2025 9:42PM

 

మాట్లాడితే.. రప్పా రప్పా అంటూ బెదిరిస్తున్నారు. వారి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా? అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. తాము అనేక పోరాటాలు చేసి, ఉద్యమాలు నిర్మించి ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. ప్రజలు తమను బలంగా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. అలాంటి తమకు ఈ బెదిరింపులు ఒక లెక్కకాదని చెప్పారు. బెదిరింపు రాజకీయాలు చేసే వారికే గత పాలకులను ప్రజలు ఎక్కడ పెట్టారో ఇప్పుడు చూస్తున్నారన్నారు.

తాజాగా మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ వైసీపీ హయాంలో లిక్కర్ కేసుపై స్పందించారు. 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో మద్యం నిషేధం చేస్తామని, విడతల వారీగా తగ్గిస్తామని చెప్పిన వారు విచ్చలవిడిగా ధరలు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. “డబ్బు పోతే పోయింది. జనాలు కూడా చచ్చిపోయారే. నాసిరకం లిక్కర్‌ను అంటగట్టి లివర్‌, కిడ్నీ సమస్యలు వచ్చేలా చేసి చంపేశారే” అని పవన్ వ్యాఖ్యానించారు. మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ తరువాత ఏం చేశారని నిలదీశారు.

“మద్యం కుంభకోణంలో అంతమందిని అరెస్టు చేశారు. ఇంత మందిని అరెస్టు చేశారు అని చెబుతున్నారు. తప్పులు చేశారు కాబట్టే వారిని అరెస్టు చేశారు” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును, వారి ఆరోగ్యాన్ని కూడా దోచుకుని పీల్చి పిప్పిచేసిన వారిని ఏమి చేయాలని ప్రశ్నించారు. పైగా నంగనాచి కబుర్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తప్పులు చేసి పైగా ఎదురు దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ పేపర్ పులులకి, తాటాకు చప్పుళ్లకి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదన్నారు. కేసు విచారణ ముమ్మరంగా సాగుతోందని పవన్ తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదని హెచ్చరించారు.