TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నర్సులు అందిస్తున్న సేవలను వెలకట్టలేము : డిప్యూటీ సీఎం ప‌వ‌న్

Published on: Mon May 12, 2025 3:23PM

 

వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలను వెలకట్టలేమని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం  ప్ర‌భుత్వ హాస్పిటల్ స్టాఫ్ న‌ర్సుల‌తో ఆయన సమావేశం అయ్యారు. ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని నర్సింగ్ అసిస్టెంట్‌లను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగుల‌కు స్వ‌స్థ‌త క‌లిగేలా వృత్తికి గౌర‌వాన్ని తీసుకువ‌స్తున్నార‌ని పవన్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవ‌లు అనన్య సామాన్యమని అన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న న‌ర్సుల సేవ‌ల‌ను ఎవ‌రూ మ‌రిచిపోర‌ని తెలిపారు. 

మ‌హ‌మ్మారి క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా న‌ర్సులు చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయమ‌ని పేర్కొన్నారు. ఇక‌, ఇటీవ‌ల సింగ‌పూర్‌లో త‌న కుమారుడు మార్క్ శంక‌ర్ స్కూల్లో సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ త‌ర్వాత ఆసుప‌త్రిలో చేరాడ‌ని, అక్క‌డ న‌ర్సులు చేసిన సేవ‌లు చూసిన‌ప్పుడు మ‌రోసారి వారి క‌ష్టం గుర్తుకొచ్చింద‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా వారిని క‌లవ‌డం ఎంతో సంతోషన్ని ఇచ్చింద‌ని పవన్ అన్నారు. ఈ సంద‌ర్భంగా నర్సింగ్ అసిస్టెంట్‌‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని, వాటిని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.