సస్పెండై నిరసన తెలుపుతున్న ఎంపీలకు టీ అఫర్ చేసిన డిప్యూటీ చైర్మన్

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో పోడియంలోకి దూసుకెళ్లి, నిసరన తెలియజేసి సభ నుండి సస్పెండ్ అయిన 8 మంది వివిధ పార్టీల ఎంపీలు, నిన్న రాత్రంతా పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద తమ ఆందోళనను కొనసాగించారు. తాము రైతుల హక్కుల కోసం పోరాడుతున్నామని, మరో పక్క పార్లమెంట్ ను చంపేశారని రాసున్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. అయితే ఈరోజు ఉదయం జరిగే సమావేశాల కోసం పార్లమెంట్ కు వచ్చిన డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నిరసనలో ఉన్న ఎంపీలకు టీ అఫర్ చేసి షాక్ ఇచ్చారు. ‌పరోక్షంగా ఆ ఎంపీల స‌స్పెన్ష‌న్‌కు తానే కార‌ణ‌మైన‌ప్ప‌టికీ.. అవేవీ ప‌ట్టించుకోకుండా నిర‌స‌న‌లో కూర్చున్న ఎంపీల‌ను స్వ‌యంగా వెళ్లి క‌లిశారు. అంతేకాకుండా వారికి తానే గ్లాసులో టీ నింపి ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే ఆ ఎంపీలు మాత్రం హరివంశ్ ఇచ్చిన టీ తాగేందుకు నిరాకరిస్తూ, ఆయనను రైతు వ్యతిరేకిగా పేర్కొన్నారు.