తెలుగు వారికి చల్లని కబురు

మండే ఎండలతో..ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు చల్లని కబురు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అన్నారు. ఈ వర్షాలు నైరుతి రుతుపవనాల ఆగమనం వరకు కురుస్తాయని తెలిపింది. కన్యాకుమారి ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలాయని, ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ఈ నెల 31లోపు కేరళలోని దక్షిణ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. మరో మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందట.