కుక్కలకీ ఉంది డెమోక్రసీ!

 

మనిషి సంఘజీవి! నలుగురితో కలిసిమెలిసి బతకనిదే అతనేం సాధించలేడు. కానీ నలుగురూ కలిసి బతుకుతున్నప్పుడు... అందరి మాటకీ విలువ ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రజాస్వామ్యం అనే విధానం అమల్లోకి వచ్చింది. ఎక్కువమంది ఏది అనుకుంటే, ఆ నిర్ణయానికి కట్టుబడటమే ప్రజాస్వామ్యం. ఇప్పటిదాకా మనుషులకి మాత్రమే పరిమితం అయిన ఈ పద్ధతి, జంతువులలో కూడా ఉందని నిరూపిస్తోంది ఓ పరిశోధన.

దక్షిణ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం బోత్స్వానా (Botswana). ఇక్కడి అడవుల్లో అరుదైన ఆఫ్రికన్‌ కుక్కలు నివసిస్తున్నాయి. అంతరించిపోతున్న ఈ జాతిని గమనించేందుకు సిడ్నీ నుంచి కొందరు పరిశోధకులు బోత్స్వానాకు చేరుకున్నారు. అక్కడి వాటి తీరుతెన్నులని గమనిస్తున్న సదరు పరిశోధకులకు ఓ ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది.

అడవి కుక్కలు వేటకి బయల్దేరేటప్పుడు మాంఛి హడావుడి చేస్తాయి. వాటిలో ఒక బలమైన కుక్క సారథ్యం వహించగా, అన్నీ కలిసి ఓ గుంపుగా వేటకి బయల్దేరతాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ కుక్కలు బయల్దేరే ముందు ఓ నాలుగు తుమ్ములు తుమ్మి బయల్దేరడమే విచిత్రం. కుక్కలు ఎక్కువగా తమ వాసన మీదే వేటని పసిగడతాయన్న విషయం తెలిసిందే! అందుకే తమ ముక్కులని సరిచేసుకునేందుకా అన్నట్లు అవి తుమ్ముతాయి. కానీ సరిగ్గా వేటకి బయల్దేరేముందు అన్నీ ఇలా పనిగట్టుకుని తుమ్మడం వెనుక ఏదన్నా కారణం ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు పరిశోధకులు.

ఇందుకోసం బోత్స్వానాలో ఐదు వేర్వేరు ప్రాంతాలలో నివసించే అడవి కుక్కల గుంపుల తీరుని గమనించడం మొదలుపెట్టారు. ఒకటి కాదు రెండు కాదు... 68 సందర్భాలలో అవి వేటకి బయల్దేరుతున్నప్పుడు, వాటి శబ్దాలని రికార్డు చేశారు. ఎక్కువ తుమ్ములు వినిపించినప్పుడు అవి వేటకి బయల్దేరాయనీ, తుమ్ములు తక్కువగా వినిపించినప్పుడు అవి వేటని విరమించుకున్నాయనీ తేలింది. అంటే తుమ్ముల ద్వారా అవి తమ ఓటుని ప్రకటిస్తున్నాయి! వేటకి వెళ్లడం తమకి ఇష్టం ఉందా లేదా అన్న అభిప్రయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నమాట! పైగా గుంపుకి నాయకత్వం వహించే కుక్క లేకపోతే, మరిన్ని తుమ్ములు అవసరం కావడాన్ని గమనించారు.

ఈ పరిశోధన చాలా చిన్నదే! కానీ కలిసి జీవించేటప్పుడు ఎలా మెలగాలో... జంతువులకి కూడా ఓ అవగాహన ఉన్నట్లు బయటపడుతోంది. ఓ పక్క కుక్కలేమో ప్రజాస్వామ్యానికి అలవాటు పడుతున్నాయి. మరి మనుషులేమో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. బలవంతుడిదే రాజ్యం అనే జంతుధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరి నుంచి నేర్చుకోవాలి?

- నిర్జర.