ఏపీకి డేంజర్ బెల్స్.. డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు..
Published on: Wed Jun 23, 2021 1:04PM
కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తున్న కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు ఏపీలో నమోదైంది. ప్రస్తుతం యూకేలో వేగంగా విస్తరిస్తోంది ఈ వేరియంట్. ఇండియాలోనూ కేసులు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదైన రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ఆంధ్రప్రదేశ్ కు కూడా హెచ్చరికలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలలో 40 కి పైగా డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది రాష్ట్రాల్లో ఈ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 22 కేసులు, మధ్యప్రదేశ్ లో ఆరు కేసులు, కేరళలో రెండు కేసులు, ఆంధ్ర ప్రదేశ్ , పంజాబ్, జమ్ము రాష్ట్రాలలో ఒక్క కేసు నమోదైంది. మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ ,కేరళ రాష్ట్రాలలో ఎక్కువ కేసులను గుర్తించారు.
డెల్టా ప్లస్ వేరియంట్ కు సంబంధించి మంగళవారం నాలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం.. తాజాగా బుధవారం ఏపీ సహా మరో నాలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది, అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపు ఇస్తున్న నేపథ్యంలో అప్రమత్తం చేసింది కేంద్రం. డెల్టా ప్లస్ కరోనా సోకిన వారి ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నాయి ఆయా రాష్ట్రాలు.


