TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సొంత భవన్ లో టీ మంత్రికి షాక్.. ఏపీ సిబ్బంది సాయం...

Published on: Thu Nov 23, 2017 4:11PM


ఒకటిగా ఉన్నా రాష్ట్రం విడిపోయింది. ఏపీ అంటూ తెలంగాణ అంటూ రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇక రాష్ట్రాలతో పాటు ప్రజల్లో కూడా కాస్త మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. ఏదో రాష్ట్రం విడిపోయినా మనందరం ఒకటే అని చెపుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ఆ తేడా కనిపిస్తూనే ఉంటుంది. ఇక రాజకీయాల్లోకి వచ్చే సరికి ఈ పరిస్థితి ఇంకా విచిత్రంగా కనిపిస్తుంటుంది. అదేమంటే.. ప్రాంతీయ భావనలు రాజకీయమైన లబ్థి కోసమే కానీ వ్యక్తిగత అంశాల్లో కాదన్న విషయం అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. రాజకీయంగా ఎన్ని తిట్టుకున్నా... రెండు రాష్ట్రాల నేతలు కలిసినప్పుడు మాత్రం బాగానే ముచ్చటించుకుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా...? ఎందుకంటే...  రాజకీయం కోసం ఎంతవరకైనా సై అన్నట్లుగా వ్యవహరించే తత్త్వం పాలకుల్లో ఉన్నా.. ప్రజల్లో లేదని నిరూపించే ఉదంతం తాజాగా దేశ రాజధానిలో చోటు చేసుకుంది.

 

అసలు సంగతేంటంటే... తెలంగాణ భవనంలో తెలంగాణ రాష్ట్ర మంత్రికి షాక్ తగిలితే.. అందుకు భిన్నంగా ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ సిబ్బంది స్పందించి.. ఆయనకు ఇబ్బంది లేకుండా చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఇటీవల ఒక అవార్డు తీసుకునేందుకు గాను ఢిల్లీ వెళ్లారు. ఇక అక్కడకు వెళ్లిన ఆయన అవార్డు తీసుకొని తిరిగి.. తెలంగాణ భవన్ లోని తన రూంకి వెళ్లారు. అయితే అక్కడ తనకు భోజనం తీసుకురామ్మని ఓ సిబ్బందికి చెప్పగా.. మంత్రి గారి గురించి తెలీని సదరు సహాయకుడు ఇప్పుడిక్కడ భోజనం దొరకదని చెప్పాడు. అంతేనా... దగ్గర్లోని హోటల్ కు వెళ్ళండి అంటూ ఓ ఉచిత సలహా కూడా పడేశాడట. అయితే అదే సమయంలో.. అక్కడ ఉన్న ఓ ఆంధ్రా సిబ్బంది... మంత్రి గారిని గుర్తుపట్టి...  భోజనం తీసుకొస్తానంటూ క్యాంటీన్ కు పరుగున వెళ్లి భోజనం తెచ్చి ఇచ్చాడట. ఇక సొంత భవనంలో తనకు ఎదురైన చేదు అనుభవానికి షాక్ తిన్న మంత్రిగారు.. ఇక్కడకు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అక్కడి అసిస్టెంట్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు సదరు మంత్రిగారు ఏపీ సిబ్బంది చేసిన సహాయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పారట.