ఒక్క ఫోన్, 3 సిమ్‌కార్డులతో 1500 మంది మహిళలను..
Published on: Thu Jul 7, 2016 1:50PM

పెళ్లి చూపుల సమయంలో అమ్మాయిలు తనను నిరాకరించడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని ఒక వ్యక్తి సైకోగా మారిన ఉదంతం ఢిల్లీ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఖలీద్ అనే ఒక వ్యక్తి ఒక ఫోన్, మూడు సిమ్‌కార్డులతో దేశంలోని సుమారు 1,500 మంది మహిళలను వేధింపులకు గురిచేశాడు. ఢిల్లీలోని బలిమారన్ ప్రాంతంలో ఓ షాపు రన్ చేసే మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా మూడు సిమ్‌కార్డ్‌లను ఉపయోగించి మహిళలకు ఫోన్లు చేసి..అసభ్యకరంగా మాట్లాడుతూ, మెసేజ్‌ల రూపంలో బూతులను పంపేవాడు. ఇలా దేశవ్యాప్తంగా 1,500 మందిని వేధింపులకు గురిచేశాడు. ఇతగాడి వేధింపులకు విసిగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ధైర్యం చేసి ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులకు ఇతని వ్యవహారం చాలా కాలం వరకు చిక్కుముడిగా మారిపోయింది. ఒకదశలో ఖలీద్ దొరికే అవకాశం లేదని పోలీసులే భావించారంటే మనోడి స్కెచ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఖలీద్ నంబరు నుంచి జార్ఖండ్‌లోని మహిళలకు ఫోన్ చేయడంతో అతన్ని గుర్తించారు. అతని ఇంటి నుంచే ఈ ఫోన్లు రావడంతో ఢిల్లీ పోలీసులు వలపన్ని ఖలీద్‌ను పట్టుకున్నారు.
విచారణలో నిందితుడు చెప్పిన విషయాలను విన్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. తాను రోజుకు 25 నుంచి 30 మంది మహిళలను వేధించేవాడినని చెప్పాడు. తనను పెళ్లి చూపుల సమయంలో వివాహం చేసుకోనని కొంతమంది అమ్మాయిలు నిరాకరించడం వల్లే మహిళలను వేధించడం మొదలెట్టానని ఖలీద్ వెల్లడించాడు. ఖలీద్ దగ్గరున్న సిమ్ కార్డులన్నీ చాందినీ చౌక్‌లోని మొబైల్ షాపుల్లో కొన్నవేనని..ఈ నంబర్లకు తరచూ రీఛార్జ్‌లు చేయించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన టెలికాం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


