మృగాళ్ళ ముందు చట్టాలు కూడా చట్టుబండలే

 

గతేడాది డిశంబర్ లో డిల్లీలో ఒక యువతిపై జరిగిన అత్యాచారంలో పట్టుబడిన నిందితులను వీలయినంత త్వరగా కటినంగా శిక్షిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలందరూ, ఆందోళన చేస్తున్న ప్రజలకి వాగ్దానం చేసారు. ఆ తరువాత అత్యాచార నిరోధించడానికి ఒక బిల్లు పాస్ చేసారు. ఈ కేసులో త్వరితంగా విచారణ పూర్తిచేసి దోషులకు శిక్షలు వేసేందుకు ప్రత్యేకకోర్టు కూడా నెలకొల్పారు. కేసు విచారణ మొదలయింది. కాగా ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

 

కేసు మొదలుపెట్టినప్పుడు ఇది చాల సాధారణమయిన కేసని, విచారణ కేవలం ఒకటి రెండు నెలలో ముగిసి, దోషులకు శిక్షలు పడటం ఖాయమని న్యాయ నిపుణులు ముక్త కంఠంతో చెప్పారు. కానీ ఇంత కాలమయినా అది కొలిక్కి రాలేదు, ఏ ఒక్క దోషి కూడా శిక్షింపబడలేదు. తత్ఫలితంగా ఇటువంటి నేరాలు దేశంలో మరింత పెరిగిపోయాయి.

 

అత్యంత హేయమయిన ఇటువంటి సంఘటనలు నేటికీ ఇంకా జరుగుతున్నాయంటే అందుకు కారణం చట్టం తమనేమి చేయలేదనే నమ్మకమే. ఇటువంటి నేరాలకి పాల్పడినవారు చట్టంలో లొసుగులను అడ్డంపెట్టుకొని కేసులు ముందుకు కదలకుండా చేయగలుగుతున్నారు. డిల్లీలో సామూహిక అత్యాచారంలో ప్రధమ ముద్దాయిగా పేర్కొనబడుతున్న బాలనేరస్తుడు తరపున వాదిస్తున్న లాయర్, తన క్లయింటు నేరం చేసినట్లు అసలు ఎటువంటి ఆధారాలు లేవని వాదిస్తున్నాడు. మిగిలిన నేరస్తులు కూడా దాదాపు అదే విధంగావాదిస్తున్నట్లు సమాచారం.

 

బాలనేరస్తుడిపై ప్రధానంగా ఎదుర్కొంటున్న అత్యాచార ఆరోపణలతో బాటు, ఒక కార్పెంటర్ ని దోపిడీ చేసిన కేసు కూడా నమోదయింది. ఈ రెండు కేసులపై బోర్డు ఈనెల 25న తన తుది తీర్పు వెలువరించబోతోంది. కానీ , బాలనేరస్థులకు కేవలం మూడున్నర సం.ల కంటే ఎక్కువ జైలు శిక్ష విదించే అవకాశం లేకపోవడంతో, అంత హేయమయిన నేరానికి పాల్పడినప్పటికీ అతను ఒక చిన్న శిక్షతో తప్పించుకొనే అవకాశం ఏర్పడింది.

 

సమాజంలో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా చట్టాలు రూపొందించకొనకపోతే తీర్పులు, సమాజంలో నేరాలు ఇదే విధంగా ఉంటాయి.