పోలీసుల అదుపులో డిప్యూటీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వం మధ్య సంబంధాలు రోజు రోజుకి దెబ్బతింటున్నాయి. ఆప్ ఎమ్మెల్యే దినేష్‌ను అరెస్ట్ చేయడంతో పాటు ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు పెట్టినందుకు గానూ ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళనకు దిగిన వారు సిసోడియాతో కలిసి రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోడీ అధికార నివాసానికి ర్యాలీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఢీల్లీ పోలీసులు ప్రధాని నివాసం వెంబడి 144 సెక్షన్ విధించారు. దీనితో పాటు సిసోడియాతో పాటు 65 మంది ఎమ్మెల్యేలను రేస్‌కోర్స్ రోడ్డుకు వెళ్లకుండా తుగ్లక్ రోడ్డు సమీపంలో వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

నిన్న సిసోడియా ఘజియాబాద్ మండిలో పర్యటించిన సందర్భంగా తమను దూషించారంటూ పలువురు వ్యాపారవేత్తలు డిప్యూటీ సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన తనపై ఫిర్యాదు చేసిన వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని...వాటిని మానకుంటే లైసెన్స్ రద్దు చేస్తానని హెచ్చిరించినట్టు సిసోడియా తెలిపారు. తనపై కావాలనే కేంద్రప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. వరుస పరిణామాలను గమనిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ ఎదుట సిసోడియా పోలీసులకు లొంగిపోతారని ప్రకటించారు.