చెల్లెలికి పసుపు రంగు బైకు ఉందని అన్నకు బేడీలు.. అవాక్కయిన జడ్జ్ 

ఆ రంగుల బైకు ఒక అమాయకుడిని దొంగగా బోనులో నిలబెట్టింది. చెల్లికి ఉన్న పసుపు రంగు బైక్‌, దానికి ఎరుపు రంగు రిమ్ములు ఉండడమే ఆ అన్న పాలిట శాపమైంది. పోలీసులు అతనిపై ఏకంగా దొంగతనం నేరం మోపడానికి కూడా ఆ బైకు కారణమైంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ఒక దొంగతనం జరిగింది. ఆ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. దొంగ ఎరుపు రంగు రిమ్ములున్న పసుపురంగు బైక్‌పై పరారయ్యాడని కంప్లైంట్ చేసాడు. దీంతో.. ఢిల్లీ పోలీసులు అటువంటి బండి కోసం వెతికి.. ఆ వాహనం యజమాని ఒక యువతి అని తేల్చారు. వెంటనే ఆమె సోదరుడు నందాను ఈ దొంగతనం కేసులో అరెస్టు చేశారు.

 

ఈ కేసు నుండి బయటపడాలంటే తమకు రూ. 50వేలు లంచం ఇవ్వాలని.. అపుడే నందాకు బెయిల్‌ దొరుకుతుందని అతడి సోదరికి చెప్పారు. మరోపక్క నందాను అదనపు సెషన్స్‌ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి బాధితుడి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. బెయిల్‌ కోసం ఒక ఏఎస్సై లంచం డిమాండ్‌ చేయడంపైన ఆయన సీరియస్‌ అయ్యారు. దీంతో నందాపై తప్పుడు కేసు పెట్టిన ఎస్‌హెచ్‌వో, దర్యాప్తు అధికారి, లంచం డిమాండ్‌ చేసిన ఏఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జడ్జ్ డీసీపీని ఆదేశించారు.