గాలి కాలుష్యానికి తోడైన నీటి కాలుష్యం! ఢిల్లీలో డేంజర్ బెల్స్ 

దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గాలి కాలుష్యంతో ఇప్పటికే ఢిల్లీ ప్రమాదంలో ఉండగా మరో షాకింగ్ న్యూస్ బయటికొట్టింది. ఢిల్లీలో తాగేందుకు  ఉపయోగిస్తున్న నీటిలో అమ్మోనియా ప్రమాదర స్థాయిలో ఉందని తేలింది. ఢిల్లీ నగరానికి యమునా నది నుంచి నీరు సరఫరా అవుతుంది. ఈ నీటిలో అమ్మోనియా ప్రమాదకర స్థాయికి చేరిందని పరిశోధనల్లో వెల్లడైంది. ఢిల్లీ జల మండలి కూడా దీన్ని ధృవీకరించింది. నివారణ చర్యలు చేపట్టామని, యమునా నది నీటిలో అమ్మోనియా స్థాయి తగ్గే వరకు లో ప్రెషర్‌తో నీటిని సరఫరా చేస్తామని తెలిపింది. 

 

అమ్మోనియా అనేది హైడ్రోజన్, నైట్రోజన్ కలిసిన వాయు రూప మిశ్రమం. రంగులేని పదార్థం. ఇది నీటిలో బాగా కరుగుతుంది. మితిమీరిన అమ్మోనియా ఉన్న నీటిని వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. గాలిలో ఉండే అమ్మోనియా వల్ల మానవుల కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులు, ముక్కు మండుతున్నట్లు అనిపిస్తాయి. అదే తాగు నీటిలో మోతాదుకు మించి అమ్మోనియా ఉంటే అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో చర్మంపై కాలినట్లు మచ్చలు ఏర్పడుతాయని చెబుతున్నారు. 

 

ఇప్పటికే గాలి కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తాగు నీరు కుడా కాలుష్యం భారీన పడటంతో వణికిపోతున్నారు.  నీటి కాలుష్యం మరింత పెరిగితే తమను ఎవరూ రక్షంచలేదని ఢిల్లీ జనాలు ఆందోళన చెందుతున్నారు. తమ అరోగ్యంపై వారు తీవ్రంగా భయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

 

మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కేంద్రం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల జైలు లేదా రూ.కోటి జరిమానా విధిస్తారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు వాయు కాలుష్య సమస్య ఎక్కువగా ఉన్న సమీప ప్రాంతాలకూ వర్తిస్తుందని తెలిపింది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోనూ ఆర్డినెన్స్‌ అమల్లో ఉంటుందని వివరించింది. ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో గాలి నాణ్యతా నిర్వహణకు 20 మంది సభ్యులతో కమిషన్‌ను నియమిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.