ఢిల్లీ పరువు గంగలో కలిసింది

ఢిల్లీ.. భారతదేశ రాజధాని.. చరిత్రలో ఎన్నో గొప్ప రాజవంశాల పాలనకు సజీవ సాక్ష్యం.. ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక చారిత్రక కట్టడం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అందుకే భారతీయులు తన జీవితకాలంలో ఒక్కసారైనా రాజధానిని చూడాలనుకుంటారు. ఇంతటి ఘన వారసత్వానికి కేరాఫ్‌గా నిలిచే ఢిల్లీ ఇప్పుడు ఒక చెడ్డపేరు మూటకట్టుకుంది. మహిళలకు ఏమాత్రం భద్రత లేని నగరాల్లో హస్తినాపురం అగ్రస్థానంలో నిల్చుంది. లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ అనే సంస్థ ప్రపంచంలోని 19 మహా నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

 

ఈ ఏడాది జూన్- జూలై నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో నగరం నుంచి 20 మంది చొప్పున మొత్తంగా 380 మంది పాల్గొన్నారు. వారి నుంచి సేకరించిన వివరాల ఫలితాలను తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్న నగరాల జాబితాలో ఢిల్లీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ, సావోపౌలో ( ఢిల్లీ ) నగరాల్లో మగువలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. అత్యాచారాలతో పాటు లైంగిక హింస, వేధింపులు, భౌతిక దాడులు ఇలా మొత్తంగా చూస్తే అత్యంత ప్రమాదకరమైన నగరాల జాబితాతో ఈజిప్ట్ రాజధాని కైరో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మెక్సీకో సిటీ, తరువాతి స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిలిచాయి.

 

ఇక మన రాజధాని నగరం ఢిల్లీ ఈ జాబితాలో నాలుగో స్ధానంలో నిలిచింది. ఢిల్లీ కంటే కూడా పాక్ వాణిజ్య నగరం కరాచీ మెరుగైన స్థానంలో నిలవడం గమనార్హం. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బస్సులో వెళుతున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు కామాంధులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

 

దీనిపై దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రావాలని ప్రజలు పోరాటాలు చేశారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్ష విధించేందుకు గానూ నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అత్యాచారాలు తగ్గాల్సిందిపోయి అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 140 అత్యాచార ఘటనలు, 238 మంది మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 43 రేప్ కేసులు.. 133 మంది మహిళలపై వేధింపుల ఘటనలు పరిష్కారానికి నోచుకోలేదు. జనాభాకు సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడంతోనే నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మహిళలపై అత్యాచారాల ఘటనల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవడం సగటు భారతీయుడిని.. ముఖ్యంగా ఢిల్లీ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.