ఫిరాయింపు నేతలను పబ్లిక్ లో చెప్పుతో కొట్టిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త

 

ఒక పార్టీ గుర్తు మీద గెలవడం, తరువాత అధికార పార్టీలోకి జంప్ అవడం.. ఈ మధ్య నాయకులకు కామన్ అయిపోయింది. వారికి ఓట్లేసిన ప్రజలు, వారి గెలుపుకి కృషి చేసిన కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం పార్టీ ఫిరాయిస్తున్నారు. ఇదే అటు ఓటర్లు, ఇటు కార్యకర్తల ఆగ్రహానికి కారణమవుతోంది. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ గుర్తుపై గెలిచి తరువాత టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యే హరిప్రియకు ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లిన ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొని.. ఆమె మరియు ఆమె అనుచరులపై చెప్పులు, రాళ్లు విసిరారు. తాజాగా ఇలాంటి సంఘటనే వరంగల్ లో జరిగింది.

అసలే కాంగ్రెస్ నుండి ఎన్నికల బరిలోకి దిగి హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. దీంతో టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ ని విలీనం చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంలో ఉన్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్నగాక మొన్న గెలిచిన ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ ని వీడి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో కార్యకర్తల్లో కోపం కట్టలుతెంచుకుంది. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఎంపీటీసీలు గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్త ఫిరాయింపు ఎంపీటీసీ లపై చెప్పుతో దాడి చేసింది.

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుండి నర్సంపేట మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరుగురు ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీపీ స్థానం దక్కించుకోవాలంటే కాంగ్రెస్ నుండి ఎంపీటీసీలు సహకారం అందించాలి. ఈ నేపధ్యంలో 30 లక్షలు ఇస్తాం అంటూ ముగ్గురు ఎంపీటీసీలను ప్రలోభ పెట్టి టీఆర్ఎస్ నాయకులు ఓటింగ్ కు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్న క్రమంలో గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఈ సమయంలోనే ఓ మహిళా కార్యకర్త కాంగ్రెస్ గుర్తుతో గెలిచి టీఆర్ఎస్ కి అమ్ముడు పోతారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామస్తులు సైతం మీకు ఓట్లేసి గెలిపిస్తే పార్టీ మారతారా అంటూ ఆ ఎంపీటీసిలను నిలదీశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులపై దాడికి దిగుతున్న తరుణంలో ఆ మహిళా కాంగ్రెస్ కార్యకర్త కోపోద్రిక్తురాలైంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎంపీటీసీలను చెప్పుతో కొట్టింది. పోలీసులు అడ్డుకున్నా సరే పార్టీ మారిన ఎంపీటీసీలపై చెప్పుతో దాడి చేసి పరువు తీసింది. ఈ సంఘటన ఫిరాయింపు నేతలకు షాక్ కొట్టినట్లు అయ్యింది. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఫిరాయింపులపై తిరగబడితే ఎలా ఉంటుంది అన్న భావన ఈ సంఘటనతో అందరినీ ఆలోచింపజేస్తుంది.