వేటకి కారణం మంత్రివారి కొడుకా? వెయిటింగ్ మోడ్ లో పోలీసులా?

మీకు సల్మాన్ ఖాన్ తెలుసా? మనోడు చాలా పెద్ద బాలీవుడ్ స్టార్. అయినా సరే సల్మాన్ ను ఓ కేసు ముప్పతిప్పలు పెడుతోంది. కోట్లాది మంది అభిమానులకు కావాల్సిన వాడైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడెప్పుడో కృష్ణ జింకల్ని వేటాడాడని సల్లూ మీద ఆరోపణలున్నాయి. ముందు ముందు ఖచ్చితంగా శిక్ష పడే సూచనలు కూడా వున్నాయి! 

 

ఇప్పుడు ఒక సారి సీన్ కట్ చేస్తే... గత ఆదివారం అర్థరాత్రి అటవీ అధికారులకి సమాచారం అందింది. జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని అంబట్ పల్లి, సురారం సమీపంలో వన్యప్రాణుల వేట సాగుతోందని సారాంశం. వెంటనే బయలుదేరి వెళ్లిన వాళ్లకి దుండగలు ఎదురుపడనే పడ్డారు. పదిహేను మంది వరకూ హంటర్స్ , మరికొంత మంది స్థానికులు కూడా వుండటంతో అధికారుల మీద వేటగాళ్లదే పై చేయి అయింది. గన్నులతో బెదిరించి పారిపోయారు. అయితే, వాళ్లు అక్కడ వదిలిపోయిన ఇండికా కార్ లో చచ్చిపడి వున్న రెండు దుప్పులు హృదయ విదారకంగా కనిపించాయి. అంతే కాదు, ఇండికా కార్ లో వాహనం ఓనర్ ఆధార్ కార్డ్ కూడా దొరికింది. విమాన ప్రయాణానికి ఉద్దేశించిన ఫ్లైట్ టికెట్స్ కూడా లభించాయి!

 

చచ్చిన దుప్పులు, ఆధార్ కార్డ్, విమాన టికెట్లు.. ఇన్ని ఆధారాలు వుంటే కేసులో నిందుతుల్ని అరెస్ట్ చేయటం ఎంత సేపు? పోలీసులకి క్షణాల పని! కాని, అలా జరగలేదు. చిన్న చిన్న పిక్ పాకెట్ గాళ్లని సెల్ లో వేసి లాకప్ డెత్ కూడా చేసేసే మన వ్యవస్థలో అత్యంత తీవ్రమైన వన్యప్రాణుల వేట చేసిన వార్ని మాత్రం ఎవ్వరూ ఏమీ చేయటం లేదు. ఆదివారం నుంచీ ఇప్పటి వరకూ ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. ఎందుకు?

 

సల్మాన్ లాంటి సూపర్ స్టార్ కూడా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని మనం చెప్పుకున్న తీవ్రమైన వన్య ప్రాణుల వేట... రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ఒత్తిడి ముందు నిల్వలేకపోతోంది. మహదేవ్ పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన దారుణం వెనుక ఓ మంత్రి కొడుకు గారి హస్తం వుందట! ట్రిగ్గర్ లు నొక్కటానికీ, అమాయకమైన దుప్పులు చావటానికి ఆయనే కారణమట. పైగా తండ్రిగారైన మన మంత్రిగారు క్యాబినేట్లో కేసీఆర్ తరువాత అంతటి ప్రధానమైన వ్యక్తట! ఇక చెప్పేదేముంది? 

 

నిజంగా మూగ ప్రాణుల వేటలో మంత్రిగారి కొడుకు హస్తం వుందా? వుంటే ఆ మంత్రెవరు? ఆ కొడుకు పేరేంటి? లేకపోతే, మరి చేసిన వారెవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోలీసులే. కాని, మన దేశంలో పోలీసు వ్యవస్థ, చట్టాలు కూడా వన్యప్రాణుల మాదిరిగానే చాలా సార్లు వేటకు గురవుతుంటాయి కదా... న్యాయాన్ని ఆశించటం అత్యాశే!