TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ తిరుమల పర్యటనకు డిక్లరేషన్ తంటా!

Published on: Thu Sep 26, 2024 10:14AM

జగన్ మోహన్ రెడ్డి గతంలో పలు మార్లు తిరుమల వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో, అంతకు ముందు ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో పలు మార్లు ఆయన తిరుమల వెళ్లారు. అయితే ఎప్పడూ ఆయన తిరుమల దేవునిపై తనకు విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే గతంలోలా ఇప్పుడు పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆయన జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అంతకు మించి తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ఆయన సీఎంగా ఉన్న కాలంలోనే జరిగింది. దీనిపై సర్వత్రా జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తిరుమల టూర్ పెట్టుకున్నారు. లడ్డూ వివాదం విషయంలో తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకునేందుకు ఆయన తిరమల దేవుడిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ జగన్ పుట్టుకతో క్రైస్తవుడు. ఆయన తిరుమల దేవుడిని దర్శించుకోవాలంటే తనకు వేంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వాలి.  

ఇప్పటి వరకూ అధికారం అండతో డిక్లరేషన్ ఇవ్వకుండానే, తన విశ్వాసాన్ని ప్రకటించకుండానే తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు. పైగా స్వయంగా జగన్ తల్లి విజయమ్మే ఒక సందర్భంలో తాము హిందువుల ఓట్ల కోసమే ఆలయాలకు వెడతామని ప్రకటించారు కూడా. జగన్ కూడా ఇప్పటి వరకూ అదే పాటించారు. హిందువుల ఓట్ల కోసమో, మరో రాజకీయ లబ్ధి కోసమో.. తెలంగాణ ముఖ్యమంత్రి దారిలో నడిచి ఆయన కొందరు స్వామీజీల కాళ్లకు మొక్కారు.  అంతెందుకు ముఖ్యమంత్రి హోదాలో ఒక్క సారి కూడా ఆయేన సతీసమేతంగా గుడికి వెళ్లిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన సమయంలో కూడా ఆయన  తిరుమల దేవుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు.  అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి  డిక్లరేషన్ అడిగే ధైర్యం అధికారులు చేయలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఉండదు. 

 ఈ నేపథ్యంలో జగన్ తిరుమల దేవుడిని దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చనీ, అయితే డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే దర్శించుకోవాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశాన్ని అట్టుడికిస్తున్న తరుణంలో జగన్ తిరుమల దేవుడి దర్శనానికి బయలు దేరడంతో ముందు డిక్లరేష్ ఇచ్చి ఆ తరువాత తిరుమల వెళ్లాలన్ని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా  శ్రీవారిని దర్శించుకోవడాన్ని భక్తులు కూడా అంగీకరించరు. పోనీ డిక్లరేషనే కదా ఇచ్చేస్తే పోలా అనుకునే వ్యక్తి కాదు జగన్.  ఆయనకు దర్శనం టిక్కెట్ ఇచ్చే ముందే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి. పెడితే సరే.. లేకుంటే ఆయనను దర్శనానికి అంగీకరించరు.  మరి జగన్ రెడ్డి ఏం చేస్తారో చూడాల్సిందే.