సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కి తగ్గిన కేంద్రం

 

సీబీఐ డైరెక్టర్ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ అస్థానా మధ్య వివాదాలు రచ్చకు దారితీయడంతో వారిద్దరిని కేంద్రం గతేడాది సెలవుపై పంపిన విషయం తెలిసిందే. దీంతో ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నేడు వెల్లడించింది. ఆలోక్‌ వర్మను సెలవుపై పంపడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆయనకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందని స్పష్టం చేసారు. అయితే సెంట్రల్ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) సిఫార్సు మేరకే సీబీఐ ఇద్దరు ఉన్నతాధికారులను సెలవుపై పంపామని తెలిపారు. ‘ఏ ఒక్క వ్యక్తికీ ప్రభుత్వం అనుకూలంగా ఉండదు. సీబీఐలో టాప్‌ 2 అధికారులిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో సంస్థ సమగ్రత, విశ్వసనీయతను కాపాడేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీవీసీ సిఫార్సులు తీసుకున్న తర్వాతే సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాను సెలవుపై పంపించింది. కోర్టు తీర్పును ఇంకా పూర్తిగా చదవలేదు. దీనిపై వారం రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటాం’ అని జైట్లీ తెలిపారు.