TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుజ‌రాత్‌లో 21 బ్లాస్ట్‌లు.. 56 మంది బ‌లి.. జైల్లో సొరంగం.. 38 మందికి ఉరి.. ఫుల్ డిటైల్స్..

Published on: Fri Feb 18, 2022 3:10PM

అది ఉగ్ర‌మూక‌లు సృష్టించిన మార‌ణ‌హోమం. వాళ్లు మ‌నుషులు కాదు రాక్ష‌స సంతానం. 70 నిమిషాల గ్యాప్‌లో వ‌రుస‌గా 21 బంబులు పేల్చారు. అభంశుభం తెలీని 56 మంది అమాయ‌క ప్ర‌జ‌ల‌ను దారుణంగా హ‌త‌మార్చారు. బాంబు పేలుళ్ల తాకిడికి వారి శ‌రీరాలు పీస్ పీస్ అయ్యాయి. డెడ్‌బాడీల ఆన‌వాళ్లు గుర్తించ‌డం క‌ష్ట‌మైంది. ఇదంతా.. 14 ఏళ్ల క్రితం గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన మార‌ణ కాండ‌. క‌ట్ చేస్తే.. ఆనాటి ఉగ్ర ఉన్మాదుల‌కు ఇన్నాళ్ల‌కు క‌ఠిన శిక్షలు ప‌డ్డాయి. 

అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. ఆ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చగా.. వారికి శిక్షలు ఖరారు చేసింది. దోషుల్లో 38 మందికి మరణ శిక్ష.. మిగతా 11 మందికి జీవిత ఖైదు విధించింది కోర్టు.  

2008 జులై 26న అహ్మదాబాద్‌ నగరంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు  జ‌రిపారు. ఆ బ్లాస్టింగ్స్‌లో మొత్తం 56 మంది అమాయక ప్రజలు చనిపోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. సివిల్‌ ఆస్పత్రిలోని ట్రామా కేర్‌ సెంటర్‌లో కూడా టెర్ర‌రిస్టులు బాంబులు పేల్చారంటే వారెంత కిరాత‌కులో అర్థం చేసుకోవ‌చ్చు.   

సంచలనం సృష్టించిన ఈ కేసులో దేశంలోని పలు ప్రాంతాల నుంచి 78 మందిని అరెస్టు చేశారు. హంత‌కుల‌కు ఇండియన్‌ ముజాహిదీన్ (ఐఎం)తో సంబంధాలున్నాయని తేల్చారు. 2009 డిసెంబరులో విచారణ ప్రారంభం కాగా ఒక నిందితుడు అప్రూవర్‌గా మారడంతో మిగిలిన 77 మందిపై కోర్టులో విచారణ కొనసాగింది. పేలుళ్లకు సంబంధించి సూరత్‌, అహ్మదాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో వేర్వేరుగా 35 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 13 ఏళ్ల పాటు జరిగిన విచారణలో 1,100 మంది సాక్షుల‌ను విచారించారు.  

గత ఏడాది సెప్టెంబరులో విచారణ ముగియగా.. వారిలో 49 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మిగతా వారిని నిర్దోషులుగా ప్రకటించింది. తాజాగా దోషులకు క‌ఠిన‌ శిక్షలు ఖరారు చేసింది. 38 మందికి మరణ శిక్ష.. 11 మందికి జీవిత ఖైదు విధించింది స్పెష‌ల్ కోర్టు. 

ఆ రోజు అస‌లేం జరిగిందంటే..
వ‌రుస‌గా రెండు రోజులు.. రెండు వేరు వేరు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్ల‌కు తెగ‌బ‌డ్డారు ముష్క‌రులు. 2008, జులై 25న బెంగ‌ళూరులో 8 చోట్ల‌ సీరియ‌ల్ బ్లాస్ట్స్ జ‌రిగాయి. ఆ మర్నాడే జులై 26న అహ్మదాబాద్‌లోనూ వరుస పేలుళ్లతో మారణహోమం జరిగింది. సాయంత్రం 6 గంట‌ల 45 నిమిషాల‌కు మొద‌టి బ్లాస్ట్‌. అలా దాదాపు గంట గ్యాప్‌లో న‌గ‌రంలోని 14 వేరువేరు ప్రాంతాల్లో.. 21 బాంబు పేలుళ్లతో.. అహ్మ‌దాబాద్ ద‌ద్ద‌రిల్లింది. సినిమాటిక్‌గా చెప్పాలంటే.. తుపాకీ సినిమాలో మాదిరి ఉగ్ర‌వాదులు వేరు వేరుగా విడిపోయి.. సిటీ అంతా బాంబులు పెట్టి పేల్చేశారు. 

ఆ దాడుల సమయంలో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అప్పుడు గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్నారు. అప్పుడు ప్ర‌ధానిగా మన్మోహన్‌ సింగ్ ఉన్నారు. 

ఇక‌, పేలుళ్లు జ‌ర‌గ‌డానికి 5 నిమిషాల ముందే.. మీడియాకు ఉగ్ర‌వాదులు ఈ-మెయిల్‌లో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మారణహోమానికి తామే కారణమంటూ ఇండియన్‌ ముజాహిదీన్‌ ప్రకటించింది. 2002 నాటి గుజరాత్‌ అల్లర్లకు ప్రతీకారంగానే వరుస పేలుళ్లకు పాల్పడినట్లు తెలిపింది. 2002లో గుజరాత్‌లోని గోద్రాలో హిందూభక్తులు ప్ర‌యాణిస్తున్న‌ రైలు బోగీలకు కొంద‌రు దుండ‌గులు నిప్పంటించి మార‌ణ‌హోమానికి పాల్ప‌డ్డారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆ ఘటనలో మైనారిటీ వర్గాలకు తీవ్ర ప్రాణ నష్టం జ‌రిగిందంటూ.. నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా- సిమీ ఉగ్రవాద సంస్థ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు తెగించింది. 

కేరళలో ఎర్నాకులం సమీపంలోని దట్టమైన అడవుల్లో.. సిమీ ఉగ్ర‌వాద‌ స‌భ్యుల‌కు శిక్షణ ఇచ్చి మ‌రీ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బాంబ్ బ్లాస్టుల‌కు ప్లాన్ చేసింది. సిమీకి చెందిన వారే.. ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థగా ఏర్పడి.. బెంగ‌ళూరు, అహ్మ‌దాబాద్‌లో పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు. రెండు రోజుల త‌ర్వాత‌ సూర‌త్‌లోనూ దాడులకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆ కుట్రను ముందే గుర్తించిన పోలీసులు ఆ బాంబుల‌ను స్వాధీనం చేసుకోవ‌డంతో పెద్ద ముప్పే త‌ప్పింది. అహ్మ‌దాబాద్ పేలుళ్ల‌ కుట్రలో దాదాపు 100 మందికి సంబంధం ఉండ‌గా.. వారిలో 75 మంది గుజరాత్‌కు చెందిన వారే. 

అహ్మదాబాద్‌ వరుస పేలుళ్లకు మఫ్తీ అబ్దుల్‌ బషీర్‌ ఆస్లాహీ అనే వ్యక్తి ప్ర‌ధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. నిందితులందరినీ సబర్మతి సెంట్రల్‌ జైలుకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా విచారణ కూడా అక్కడే జరిపే ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో కొందరు నిందితులు.. ఏకంగా జైలు గ‌ది నుంచి సొరంగాన్ని త‌వ్వి.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఓ హాలీవుడ్ సినిమాలో చూపించిన‌ట్టు.. ఎలాంటి పనిముట్లు లేకుండా.. భోజనం చేసే పాత్రలతోనే సొరంగం తవ్వడం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. 

ఇక‌, ఈ కేసు విచార‌ణ‌ సుదీర్ఘ కాలం పాటు సాగి.. ఇప్ప‌టికీ కానీ దోషుల‌కు మ‌ర‌ణ శిక్ష ప‌డ‌లేదు. ముంబై కాల్పుల ఉగ్ర‌వాది క‌స‌బ్‌లా.. ఈ ఉగ్ర మూక‌కు ఈ శిక్షేదో ఇంకా చాలా ముందే ప‌డుండాల్సింద‌నే భావ‌న ఉంది.