యూపీలో తీవ్ర కలకలం.. కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన గబ్బిలాలు

కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందన్న వార్తలతో.. గబ్బిలాల పేరు వింటేనే ప్రజల్లో భయం పుడుతుంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రజలైతే మరింత వణికిపోతున్నారు. యూపీలోని గోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి వుండటాన్ని చూసిన ప్రజలు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోరఖ్ పూర్ సమీపంలోని బేల్ గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు పడివుండటాన్ని చూసిన స్థానికులు.. కరోనా కారణంగానే అవి మరణించాయని భావించారు. ఈ వార్త ఆనోటా, ఈనోటా దావానలంలా వ్యాపించింది. 

ఈసమచారం వెటర్నరీ అధికారులకు తెలియటంతో, వారు సైతం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎండలు సగటుతో పోలిస్తే, చాలా ఎక్కువగా వున్న కారణంగానే గబ్బిలాలు చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు డివిజనల్‌ ఫారెస్ట్‌ హెడ్‌ అవినాష్‌ కుమార్‌ వెల్లడించారు. ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకూ ఉందని, తాగేందుకు నీరు లేకనే అవి చనిపోయి వుండవచ్చని తెలిపారు. స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. చనిపోయిన గబ్బిలాలను తదుపరి పరీక్షల నిమిత్తం వెటర్నరీ రీసెర్చ్‌ ఇని‌స్టిట్యూట్ కు‌ పంపించామని తెలియజేశారు.