జైట్లీని రాజీనామా చేయమని ప్రధాని సూచిస్తున్నారు: ఏచూరి

 

డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు పార్లమెంటులో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, ఇతర పార్టీల సభ్యులు అరుణ్ జైట్లీ రాజీనామాకు పట్టుబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా బీజేపీ నేతలందరూ అరుణ్ జైట్లీకి అండగా నిలబడుతున్నారు.

 

అరుణ్ జైట్లీకి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ “ఒకప్పుడు హవాలా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న లాల్ కృష్ణ అద్వానీ ఏవిధంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటపడ్డారో, అదేవిధంగా ఇప్పుడు అరుణ్ జైట్లీ కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని ఈ కేసు నుంచి బయటపడతారు” అని అన్నారు.

 

"హవాలా కేసులో అద్వానీపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆ కేసును ఎదుర్కొని నిర్దోషిగా బయటపడ్డారు. కనుక ఇప్పుడు అరుణ్ జైట్లీని కూడా తన పదవికి రాజీనామా చేసి నిర్దోషిగా బయటపడాలని ప్రధాని నరేంద్ర మోడి సూచిస్తున్నారని సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు. లేకుంటే ఇటువంటి సమయంలో అద్వానీ-హవాలా కేసు గురించి ఆయన మాట్లాడవలసిన అవసరమే లేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

 

డిల్లీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేసి శోదాలు నిర్వహించి తేనెతుట్టెను కదిపినట్లయింది. బీజేపీకే చెందిన ఎంపి కీర్తి ఆజాద్ కూడా అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేస్తుండటంతో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసినప్పటికీ ఆయన రాజీనామా కోసం ప్రతిపక్షాల చేస్తున్న ఈ ఒత్తిడిని తట్టుకోవడం మోడీ ప్రభుత్వానికి చాలా కష్టంగా మారింది. బహుశః అందుకే ఇటువంటి సమయంలో ప్రధాని మోడి అద్వానీ ప్రసక్తి తీసుకువచ్చేరేమో?