అందుకు ఒప్పుకుంటే.. నేను లొంగిపోతా..

 

మోస్ట్ వాంటెట్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా దావూద్ ఇబ్రహీం ఏకంగా భారత్‌కు ఓ బంపరాఫర్ ఇచ్చాడు. అయితే మాములుగా కాదులెండి... కొన్ని షరతులు కూడా విధించాడు. అసలు సంగతేంటంటే.. మిరా రోడ్ బిల్డర్‌ను బెదిరించిన కేసులో కస్కర్, ఆయన సోదరుడు దావూద్, అనీస్‌లపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. దీనిలో భాగంగానే... తాను లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నానని.. అయితే ఇందుకోసం తనను అర్థర్ రోడ్ జైలులో పెడతానంటేనే లొంగిపోతానని షరతు పెట్టాడట. అయితే అతడి షరతులకు ప్రభుత్వం నిరాకరించిందని, దావూద్‌ను అరెస్ట్ చేయలేదని దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ కేశ్వాని తెలిపారు. ఇక కోర్టుకు హాజరైన కస్కర్‌ను న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగగా... సోదరుడు దావూద్, ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడున్నారన్న ప్రశ్నకు తనకు తెలియదని.. ఇటీవల దావూద్‌తో ఫోన్‌లో మాట్లాడాను... అయితే అతడి నంబరు డిస్‌ప్లే కాదని, కాబట్టి అతడెక్కడున్నదీ తాను తెలుసుకోలేకపోతున్నానని న్యాయమూర్తికి తెలిపాడు. కాగా ఆర్థర్ రోడ్డు జైలులో ముంబయి మారణహోమంలో కీలక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను నాలుగేళ్ల పాటు ఉంచి, 2012లో ఉరితీశారు.

 

ఇదిలా ఉండగా...ఈ కేసు వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మాత్రం అదంతా కట్టుకథ అని కొట్టి పారేశారు. అయితే బిచ్చగాళ్లకు ఛాయిస్ ఉండదని.. నిజంగా దావూద్ న్యాయవాదికి దావూద్ తో కాంటాక్ట్ ఉంటే దానిని నిఘా సంస్థలు కనుక్కుంటాయని అన్నారు. దీనికి తోడు దావూద్ మోదీ ప్రభుత్వంతో చర్చలు జరిపారని, ఆయన భారత్‌కు తిరిగొస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నారని, భారత్‌లోనే తుది శ్వాస విడవాలని భావిస్తున్నారని అన్నారు. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో.. దావూద్ భారత గడ్డపై కాలు పెట్టే అవకాశం ఉందో లేదో..