అమెరికా ఆధిపత్యానికి దావోస్ వేదికగా గండి?.. ప్రపంచ దేశాల ఐక్యతారాగం?
Published on: Wed Jan 21, 2026 11:13AM

దావోస్ లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఈ సారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత సందరించుకుంది. కేవలం ఆర్థిక వ్యవహారాల పరంగానే కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలకు కూడా ఈ సారి సదస్సు వేదికగా మారింది. దాదాపు 130 దేశాల వాణిజ్య, వ్యాపార రంగాల ప్రతినిథులు ప్రముఖులతో పాటు, 400 మంది అగ్రశ్రేణి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు, వీరిలో 65 మంది దేశాధినేతలు కావడం విశేషమే కాకుండా ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణమైంది.
అన్నిటికీ మించి దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఈ సదస్సుకు అగ్రరాజ్యాధినేత హోదాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. మొత్తంగా ట్రంప్ దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కావడం ఇది మూడో సారి. ఈ సదస్సుకు ట్రంప్ హాజరే అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, ఆయన టారిఫ్ వార్, సామ్రాజ్యావాద ఆక్రమణ, ఆధిపత్య ధోరణిపై ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమౌతున్న వ్యతిరేకత ఈ సదస్సులోనూ ప్రతిఫలించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. మొత్తంగా గ్రీన్ ల్యాండ్ ను ఎలాగైనా ఆక్రమించి తీరుతాం అన్న ట్రంప్ ప్రకటన నేపథ్యంలో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ట్రేడ్ వార్ కు దారి తీసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ట్రంప్ కు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఈ సారి ఈ సదస్సు ఔట్ కమ్ ఏకధృవ ప్రపంచం అన్న భావాన్నీ లేకుండా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే అంటే ట్రంప్ దావోస్ కు చేరుకోవడానికి ముందే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వేదికగా కెనాడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికా ఆధిపత్యానికి ఇక చెల్లు చీటీ పాడాలని పిలుపు నిచ్చారు. మరో వైపు ట్రంప్ ఆక్రమణలను, టాక్స్ టెర్రర్ ను ఎదుర్కొనేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్పులా వాన్ డేర్ లేయెన్, అలాగే చైనా వైస్ ప్రీమియర్ హీ లైఫెంగ్ ల మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం.
ఇక దావోస్ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ ట్రంప్‌తో ఆయన నేరుగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిరువురి మధ్యా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆయుధాలు, వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలోనే దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆర్థిక పరమైన, అంటే పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమలకు ఆహ్వానం వంటి చర్చలు రెండో స్థానానికే పరిమితమై అమెరికా అంతర్జాతీయ ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావడంపై చర్చలకే అగ్రస్థానం దక్కే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అమెరికా ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ఐక్యతారాగం వినిపించేందుకు వేదికగా మారే అవకాశాలున్నాయని ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.


