పొట్టోడు వర్సెస్ పొడుగోడు.. ఫేస్ టు ఫేస్ లుక్స్.. వీడియో వైరల్..
Published on: Thu Mar 24, 2022 1:19PM
ఫాస్ట్ బౌలర్ బాల్ వేశాడు. బ్యాట్స్‌మెన్ డిఫెన్స్ ఆడాడు. మామూలుగా అయితే అంతటితో అది క్లోజ్. కానీ, ఆ బౌలర్ అప్పటికే అసహనంతో ఉన్నాడు. బాల్ వేశాక అదే స్పీడ్‌తో బ్యాట్స్‌మెన్ మీదకు పరుగెత్తుకొచ్చాడు. క్రీజ్‌లో ఉన్న ఆటగాడు కూడా తగ్గేదేలే అన్నట్టు ఎదురు వెళ్లాడు. ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు.. అంతలోనే కూల్ అయి నవ్వుతూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కానీ, ఆ ఇద్దరు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్న సీన్ మాత్రం.. పిచ్చ కామెడీగా ఉంది. ఆ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కాగా.. బౌలర్ షాహీన్ అఫ్రిదీ. ఇతను ఇంతుంటే.. అతను అంతెత్తు ఉన్నాడు. ఆ ఇద్దరి ఫేస్ టు ఫేస్ లుక్స్ అదుర్స్......
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీకి సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో లాస్ట్ బాల్‌కి ఈ ఘటన జరిగింది. అఫ్రిది వేసిన చివరి బంతిని వార్నర్ డిఫెన్స్ చేశాడు. బంతి అక్కడే పడటంతో అతడు పరుగు తీసేలా కనిపించి మళ్లీ వెనక్కి తగ్గాడు. అదే సమయంలో పాక్ పేసర్ వార్నర్ మీదకు దూసుకొచ్చి ముఖంపై ముఖం పెట్టి చూశాడు. దానికి వార్నర్ సైతం తగ్గేదేలే అనేలా చూశాడు. అయితే, క్షణాల్లోనే ఆ ఇద్దరూ నవ్వుకుంటూ వెనక్కి వెళ్లారు.
ఆ సీన్ చూసిన వారంతా మొదట అక్కడేదో గొడవ జరుగుతోందని అనుకున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించడంతో తోటి ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అఫ్రిది.. వార్నర్ కంటే చాలా ఎక్కువ ఎత్తు ఉండడంతో ఆ సీన్ చూట్టానికి చాలా కామెడీగా ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసి నెటిజన్లు తమాషాగా కామెంట్లు పెడుతున్నారు.


