సరి రాని, సరి లేని… దాసరి!

శిఖరం   ఎత్తుగా ఉంటుంది  అది అలా ఉంటేనే శిఖరమనిపించుకుంటుంది! సింహం  గర్జిస్తుంది. అది అలా   గర్జిస్తుంది కాబట్టే… సింహం అడవికి రాజయ్యేది! దర్శకరత్న అంటే  కూడా  అంతే ..  అది దాసరి  నారాయణ  రావు గారిని మనకు స్మరింపజేస్తుంది! అలా స్మరింపజేస్తుంది కనుకనే ఆ పదానికి తెలుగు సిని చరిత్రలో  అంత  విలువ!

విధి  పరీక్షలు  పెడుతుంది.  అయితే  అవి  తట్టుకొని  నిలబడాలి ,  నిలబడి   విజయం  వైపు  అడుగులు వేయాలి. అలా వేసిన  ఆ మొదటి  అడుగులే..  రేపటి   రోజున    ఒక  ప్రభంజనానికి ,  ఒక  అద్భుతానికి  నాంది  పలుకుతాయి.  సరిగ్గా ..   ఉహ కూడా  తెలియని   వయసులోనే ..  దాసరి  నారాయణరావు  గారికి   ఈ జీవిత సత్యం  చాలా   స్పష్టంగా అవగతమైంది! అందుకే   ఆయన  ఆ  నాటి   నుండే  విధితో  పోరాడటం  మొదలు పెట్టారు…

దాసరి  నారాయణ  రావుగారు  పుట్టింది  సంపన్న   కుటుంభం  లో అయినా .. అగ్ని  ప్రమాదం  తో  ఆస్తులన్నీ  పోవడం తో     ఉహ తెలిసే  సరికి ..  చుట్టూ  ఉన్న   కష్టాలే  ఆయనకి  స్నేహితులు  అయ్యాయి.  తండ్రి  ఇక చదివించలేను  అని చేతులు  ఎత్తేయడం  తో .. అంతక  ముందు సంవత్సరం .. ఉత్తమ  విద్యార్ధిగా  అవార్డుని    అందుకున్న   దాసరి  గారు , తరువాతి కాలంలో .. వెండితెర  పై  పసిడి  కాంతులు  వెలిగించిన   దాసరి గారు ..  బాల్యంలో    మాత్రం  ఒక  వడ్రంగి  వద్ద కూలీగా  చేరవలిసి వచ్చింది.

విద్యార్థి దాసరి చదువుకి పేదరికం కట్ చెప్పినా.. ఆయన తన  మాస్టారు , తోటి  స్నేహితుల  సహాయంతో బడి అనే షాట్ ని కంటిన్యూ చేశారు! చదువును ఏనాడూ  నిర్లక్ష్యం  చేయలేదు. అయితే అలానే  చదువు దగ్గరే  ఆగిపోలేదు కూడా! నాటకాలు వేస్తూ భవిష్యత్ సినిమా రంగ విజయ యాత్రకి మానసికంగా సంసిద్ధులు అవుతూ వచ్చారు!

కొద్దికాలం హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేశారు. కాని, కాలం ఆయన్ని చెన్నై తీరానికి తీసుకెళ్లింది! ఆనాటి మద్రాసులో మాటల రచయితగా జీవితాన్ని ప్రారంభించి కొన్ని సినిమాలకు ఘోస్ట్ రచయితగా, దర్శకుడిగా పని చేశారు. దాసరి లోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ నిర్మాత కె. రాఘవ  గారు   1972లో తాతా మనవడు సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు.అలా... ఎలాంటి  స్టార్   హీరోలు  లేకుండానే  ఆయన   తీసిన   మొదటి  సినిమా...    ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలిచింది . ఆ  మరుసటి  ఏడాది .. దాసరి  తెరకెక్కించిన  సంసారం  సాగరం  కూడా    మంచి   విజయం సాధించడం తో ..  దాసరి  గారి పేరు పరిశ్రమలో మారు మొగిపోయింది .

పరిశ్రమలోకి  వచ్చి రావడం తోనే.. రెండు  సూపర్  హిట్స్ .... ఎక్కడ  చూసిన   ప్రేక్షకుల  నీరాజనాలు ..  తమ తో సినిమా చేయమని  తన చుట్టూ  తిరిగే  నిర్మాతల  ప్రదక్షణలు .. ఇలా  ఒక్కసారిగా  వచ్చి  పడిన  అవకాశాలతో ..  దాసరి గారు  మాత్రం  ఎక్కడ  రాంగ్  స్టెప్  వేయలేదు.  తనకి   అంది వచ్చిన  అన్ని అవకాశాలని  ఒడిసి  పట్టుకుంటూనే నిర్మాతలు తన పై పెట్టుకున్న  నమ్మకాన్ని  నిలబెట్టుకోగాలిగారు .

1975 లో   దాసరి  గారి  దర్శకత్వంలో  తెరకెక్కిన   స్వర్గం , నరకం  చిత్రం ..  దాసరి నారాయణ  రావు  లోని .. పూర్తి దర్శకుడిని ..  ప్రేక్షకులకి  పరిచయం చేసింది  అని  చెప్పవచ్చు .  అప్పట్లో  సిల్వర్  జూబ్లి   పూర్తి చేసుకున్న  ఆ   చిత్రం ద్వారా  నే ..  కలక్షన్  కింగ్   మోహన్  బాబు    సినీ  పరిశ్రమకి  పరిచయం  అవ్వడం విశేషం .

శోభన్ బాబు , శారద  ల  కాంబినేషన్   లో  దాసరి గారు తెరకెక్కించిన  బలిపీఠo... అప్పటి  వరకు స్టార్   హీరోగా   నిలదొక్కుకోవడానికి  ప్రయత్నిస్తున్న ..  శోభన్ బాబుకి ...  సరి కొత్త  క్రేజ్  ని  తీసుకొచ్చింది . అప్పట్లో ఆ సినిమా .. విజయవాడ , గుంటూరు  వంటి  సెంటర్స్  లో 100  రోజుల  పాటు ప్రదర్శించబడి ..  దాసరి  దర్శకత్వ  ప్రతిభకి .. నిదర్శనంగా  నిలిచింది . ఇక ఈ చిత్ర విజయం  తో .. నందమూరి  తారక రామారావు  గారితో .. సినిమా చేసే  అవకశాన్ని దక్కించుకున్న  ఆయన .. 1976 లో  వచ్చిన  మనుషులంతా  ఒక్కటే  చిత్రన్ని   తెరకెక్కించి .. అన్నగారితో .. తన ప్రయాణాన్ని .. ఘనంగా  మొదలు  పెట్టారు .

కటకటాల  రుద్రయ్యా , శివ రంజని  వంటి సినిమాలని  తెరకెక్కించిన  దాసరి  1978 లో ..  స్వర్గం నరకం  సినిమాని .. హిందీ  పరిశ్రమలో .. రీమేక్ చేసి .. అక్కడ కూడా  తన సత్తా  ని  నిరూపించుకోవడం  విశేషం . అలా అప్పట్లో ....  ఒక తెలుగు దర్శకుడు .. పరాయి  బాషలో కూడా  తనని  తాను నిరూపించుకోవడం  చాలా  అరుదైన   విషయమే!

ఇక గోరింటాకు  చిత్రం .. అప్పటి మహిళా  ప్రేక్షక  లోకాన్ని .. ఎంతగా  అలరించిందో ..  విడమరిచి   చెప్పనవసరం  లేదు కొన్ని  దశాబ్దాల  పాటు తెలుగు సినీ  పరిశ్రమని ..  తన అందం  తో  మంత్ర  ముగ్ధులను చేసిన  సావిత్రి  గారికి ..  అదే చివరి సినిమా కూడా!

ప్రతి  కళాకారుడికి .. ఒక దశలో  ఉచ్చ  స్థితి  నడవడం  చాల  సాదారణమైన  విషయమే .అలా  దాసరి  గారికి మరుపురాని .. మరువలేని విజయాలు  దక్కింది  మాత్రం .. 80 వ  దశకంలో  అని  చెప్పవచ్చు .  ఆ  పదేళ్ళలో  ఆయన ..  తెలుగు సినీ  ప్రపంచంలో  ఎవరికీ  అందనంత  ఎత్తుకి  ఎదిగారు.    అయితే  అది ఒక్క దర్శకునిగా  మాత్రమే  కాదు ..  మంచి  వ్యక్తిగా  కూడా!

1980  లో  దాసరి ,  ఎన్టీఆర్  కాంబినేషన్  లో వచ్చిన   సర్దార్  పాపారాయుడు ..  అప్పటి  తెలుగు సినిమా  రికార్డుల  పై గర్జించింది  అని  చెప్పవచ్చు .  అప్పటి వరకు  అన్నగారి లో   .. అలాంటి నటన  చూడని  తెలుగు ప్రేక్షక  లోకం  ఆ సినిమాతో ..  అన్నగారి  ని  ఎంతలా  ఆరాధించారొ ,  ఆ   సినిమాని  తమకి  అందించిన  దాసరి గారిని   కూడా  అంతే  అభిమానించారు.

ఇక దాసరి ..  ఏఎన్ఆర్ ల  కాంబినేషన్  లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం ..  ప్రేమాభిషేకం! ఇప్పటికీ  ఆ చిత్రంలోని  ప్రతి మాట , ప్రతి పాట అజరామరం! అంతే కాదు… మేఘసందేశం సినిమాతో ..  దాసరి  అంటే  ఒక్క కమర్షియల్  చిత్రాలనే కాదు  అవసరమైతే ..  మనషుల  హృదయాలను  కదిలింప చేసే  కళాఖండాలను  కూడా  తెరకెక్కించగలడు  అని నిరుపిచుకున్నారు .  మరో వైపు… నాగార్జున తో  తెరకెక్కించిన  మజ్ను ,  వెంకటేష్  తో  తెరకేక్కించిన  బ్రహ్మ పుత్రుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల బంపర్ హిట్ దర్శకుడు తరువాతి తరానికి చేరువవ్వటం మనకు సూచిస్తాయి!

80 లలో  గొప్ప దర్శకునిగా  పేరు తెచ్చుకున్న .. ఈ దిగ్దర్శకుడు ...  90  లలో ..  మాత్రం   తనలోని  పూర్తి స్థాయి నటుడిని  బయటకి  తీసే  ప్రయత్నం చేశాడనిపిస్తుంది! అందులో బాగంగానే  అయన నటించి  మెప్పించిన ..  సూరిగాడు , మామగారు  వంటి చిత్రాలు..  ఈ నాటికి ..  ప్రేక్షక  హృదయాలలో  పదిలమైన  స్థానాన్ని ఏర్పరుచు కోగాలిగాయి. ఇక  ఆ తరువాతి కాలంలో ..  అయన  తెరకెక్కించిన  ఒరేయ్  రిక్షా ,  ఒసేయ్  రాములమ్మా , సమ్మక్క , సారక్క  వంటి  పలు విప్లవాత్మక  చిత్రాలను .. ఏ  అవార్డులతో  కొలవగలం  చెప్పండి?

దాసరి రాజకీయాలలోనూ  తన ప్రస్థానాన్ని  కొనసాగించారు సినీ ప్రయాణానికి ధీటుగా! 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి పార్టీని ప్రారంభించారు. కాని, అనివార్య కారణాల వల్ల కాంగ్రేస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ కు ఎన్నిక అయ్యారు. మన్మోహన్ క్యాబినేట్లో కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు.

2001 నుండి .. 2003   వరకు ..  సినిమాలను  తీయడం ,  సినిమాలలో  నటించడం  చాలా వరకు  తగ్గించేసిన  దాసరి గారు ఆ తరువాత  5  ఏళ్ళ  పాటు .. పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు .  రాత్రికి  రాత్రి తలరాతలు  మారిపోయే .. సినీ పరిశ్రమలో  5ఏళ్లు చాలా  ఎక్కువ . అయితే ఇంత గ్యాప్ తరువాత  కూడా  అయన  మేస్త్రి  సినిమా తో అవార్డ్  విన్నింగ్ ఫర్ఫార్మెన్స్ ప్రదర్శించి మెప్పించారు!

5  దశాబ్దాల   ప్రయాణంలో ...  పోటీ  అనే  మాటే ఎరుగరు అంటే ..  సరిలేని దాసరి మహాప్రస్థానం  ఏ విధంగా  సాగిందో అర్ధం చేసుకోవచ్చు . అయితే ఈ మొత్తం  ప్రయాణంలో  ఆయన ఏనాడైనా  సినిమాలకి   దూరం  అయ్యారు  ఏమో కాని ... సినీ పరిశ్రమకి  మాత్రం  దూరం  కాలేదు.  అందుకే  పరిశ్రమలో  ఎవరికీ , ఎప్పుడు , ఎలాంటి కష్టం  వచ్చినా .. ఆ సమస్య పరిష్కారం  దొరికేది మాత్రం .. దాసరి నారాయణ రావు గారి  దగ్గరే . కాబట్టే, ఆయనకు వచ్చిన పెద్ద పెద్ద హిట్స్ అన్నిటికంటే పెద్ద గౌరవమైన ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే బిరుదు దక్కింది!

1974లో వచ్చిన అయన  మొదటి  సినిమా   తాతా మనవడుకే నంది అవార్డు అందుకున్న దాసరి  గారు ..  ఆ తరువాత స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రం గా బంగారు నంది బహుమతిని పొందారు. ఇక  1983  లో   ఎంతో  కసితో   తెరకెక్కించిన  మేఘ సందేశం చిత్రానికి గాను  దాసరి  గారు మరో సారి  ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. అయితే  అయన అవార్డుల పరంపర  ఒక్క దర్శకునిగానే  కాక .. నటుడుగా  కూడా   కొనసాగటం  విశేషం . అందులో బాగంగానే   మామగారు చిత్రానికి గాను,  సూరిగాడు  చిత్రానికి  గాను ,  మేస్త్రి  సినిమాకి  గాను ,  ఉత్తమ నటుడు గా నంది అవార్డులు అందుకున్నారు. 2000 వ  సంవత్సరం  లో వచ్చిన  కంటే  కూతుర్నే  కను  చిత్రానికి   గాను  నటుడిగా జాతీయ స్థాయిలో  స్పెషల్  జ్యూరి  అవార్డ్ ని   అందుకోవడం మరో విశేషం . 1986లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు!

దానితో  పాటు  ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు. ఇక వీటితో పాటు ,, ఒక దర్శకునిగా .. అత్యధిక  చిత్రాలను  తెరకెక్కించడం  తో  లిమ్కా వరల్డ్  రికార్డ్  లో  స్థానం సంపాదించిన ఆయన ..  తెలుగు కళామ తల్లికి ..  ముద్దు  బిడ్డ  అనడంలో  ఆశర్యమేముంటుంది! అయితే  ఇన్ని  అవార్డులని  ఇన్ని రివార్డులని  అందుకున్న  దాసరి  గారు   మాత్రం ..  ప్రజలు  కొట్టే  చప్పట్లే   నిజమైన .. అవార్డులు  గా ,  వారి ప్రశంశలే .. నిజమైన  రివార్డులుగా    భావించారు! కనుకే  ఆయన   ఏ  ఒక్క తరానికో పరిమితం  కాని  దర్శకరత్న  గా మెరవగలిగారు!