విజయవాడ ఎంపీ సీటుపై వైసీపీ గురి.. బరిలో దాసరి!!

 

వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న స్థానాల మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. టీడీపీకి పట్టున్న స్థానాల్లో విజయవాడ లోక్ సభ ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే బరిలోకి దిగే అవకాశముంది. కేశినేని నానిని ఢీకొట్టి గెలిచే బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ఎప్పటినుంచో కసరత్తులు మొదలుపెట్టింది. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఈయనే అంటూ ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. కానీ వైసీపీ అధినేత జగన్ ఇంతకాలం ఎవరి పేరుని ఖరారు చేయలేదు. అయితే తాజాగా జగన్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో టీడీపీని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన వ్యక్తి కావాలని భావిస్తున్న వైసీపీ.. ఇందుకోసం దాసరి జైరమేష్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం దాసరి జైరమేష్ జగన్‌ను కలిసి అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాసరి జైరమేశ్‌తో పాటు టీడీపీ సీనియర్ నేత దాసరి బాలవర్ధనరావు కూడా వైసీపీలో చేరబోతున్నారని సమాచారం.

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దాసరి జై రమేష్ పేరు తెరపైకి రావడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉన్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం కుమారుడు హితేష్‌తో కలిసి వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై జగన్‌తో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ స్థానం కోసం ఇంకా ఎవరిని ఖరారు చేయలేదని జగన్ తెలపడంతో.. దగ్గుబాటి దాసరి జైరమేష్ పేరును సూచించారని సమాచారం.