విజయానికి ఎనిమిది మెట్లు – విజయదశమి!

మహిషాసురుని అంతమొందించిన విజయదశమి రానే వచ్చింది. మహిషాసురుడంటేనే దుర్గుణాలకు ప్రతీక. మరి దుర్గాదేవేమో శక్తి స్వరూపం. దేవతలంతా తమ శక్తిని చేర్చి, ఆయుధాలన్నింటినీ కూర్చి సన్నద్ధం చేసిన దేవత దుర్గ. ఇప్పటి రోజుల్లో మహిషాసురుడు లేకపోవచ్చు. కానీ అజ్ఞానం, అలసత్వం, అపజయం వంటి దుర్గుణాలన్నీ మహిషునితో సమానమే. ఆ బలహీనతలను జయించలేకపోతే, జీవితమనే యుద్ధంలో పరాజయం తప్పదు! ఒక్కసారి ఆ కనకదర్గను కళ్లముందు నిల్పుకుంటే ఆమె ప్రతి చేతిలోనూ విజయానికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి.

శంఖం: యుద్ధాన్ని ప్రారంభిస్తూ అమ్మవారు శంఖాన్ని పూరించగానే, మహిషాసురుని గుండెలు అదిరిపోయాయి. శంఖాన్ని పూరించడం అంటే సమరానికి మనం సన్నద్ధమన్న విషయాన్ని తెలియచేయడమే. శ్రీకృష్ణుని పాంచజన్య నినాదంతోనే కదా కురుక్షేత్రం మొదలైంది. జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా వెనుతిరగకుండా, దాన్ని ఎదుర్కోవాలని శంఖం చెబుతోంది. అనుకున్న పనిని సాధించేందుకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాన్ని అది అందిస్తోంది.


 

విల్లు, బాణం: విల్లుని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించడం లక్ష్యసాధనను గుర్తుచేస్తుంది. ప్రతి మనిషికీ ఏదో ఒక లక్ష్యం ఉండాలి. బాణాన్ని సంధించాలి అంటే ఏదో ఒక గురిని ఏర్పరుచుకుని ఉండాలి కదా! ఇతిహాసాల్లో మరో దృశ్యం కూడా కనిపిస్తుంది. వీరులు తాము సంధించిన బాణాన్ని వృథాగా పోనిచ్చేవారు కాదు. అంటే మన శక్తి సామర్థ్యాలను అనవసరమైన పనుల మీద, వ్యసనాల మీదా కేంద్రీకరించకుండా… ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని వైపు గురి చూసి మన శక్తిని వదిలితే ఇక విజయం మనదే!



 

చక్రం: బాణం దిశను సూచిస్తుంది. సూటిగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. కానీ చక్రానికి దశ కూడా ఉంటుంది. ఎన్ని మలుపులని దాటుకునైనా, ఎంత ఎత్తుని చేరుకునైనా… శత్రువుని బట్టి తన వేగాన్నీ, మార్గాన్నీ మార్చుకుని చివరికి అనుకున్నది సాధిస్తుంది. విజయం సాధించాలంటే సూటిగా దూసుకుపోవడం ఒక్కటే మార్గం కాదు. దానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఎప్పటికప్పడు దాన్ని సమీక్షించుకోవాలి, అవసరమైన మార్పులు చేసుకోవాలి, ఎత్తుకి పైఎత్తు వేయాలి… చివరికి గమ్యాన్ని చేరుకోవాలి. ఇంతటి ప్రభావం ఉన్నది కాబట్టే శ్రీకృష్ణుడు సైతం సుదర్శన చక్రాన్ని ఆయుధంగా తన చెంతనే ఉంచుకున్నాడు.



 

గద: మనిషికి తొలి ఆయుధం గద. ఆ తర్వాతే బాణాలు వచ్చాయి. కంటికి ఎదురుకుండా ఉన్న సమస్యను ఎదుర్కోవడానికి గదే సరైన ఆయుధం. ఎక్కడో ఉన్న లక్ష్యాలను ఛేదించడమే కాదు, ముందు మన ఎదురుగా ఉన్న బలహీనతలను చావగొట్టమని గద చెబుతోంది. పైగా గద శారీరక దృఢత్వాన్ని సూచిస్తుంది. దాని బలమంతా మన కండబలం మీదే ఆధారపడి ఉంది. లక్ష్యసాధనలో పడి చాలామంది చేసే పొరపాటు ఇదే! మెదడుతోనే అంతా సాధించగలమని అనుకుంటూ, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. జీవితంలో పరిపూర్ణతని సాధించాలంటే శరీర దృఢత్వం కూడా అవసరమని గదాయుధం చెబుతోంది.


 

తామరపూవు: చక్రం వంటి ఆయుధం ఇచ్ఛాశక్తిని (మెదడు) సూచిస్తే, గద వంటి ఆయుధాలు క్రియాశక్తిని (శరీరం) సూచిస్తాయి. మరి జీవితం సఫలం కావాలంటే జ్ఞానం కూడా అవసరమే కదా! అందుకే అమ్మవారిని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణీ అంటారు. ఆ జ్ఞానానికి చిహ్నమే తామర. వికసించిన మనసుకీ, దైవత్వానికి తామరను గుర్తుగా చెబుతారు. బురద కొలనులో ఉన్నా తనదైన రూపాన్ని వదులుకోదు. నీటిలో ఉన్నా తడిని అంటనివ్వదు. ఒకరకంగా చెప్పాలంటే నిజమైన కర్మయోగికి అసలైన చిహ్నం తామరపూవు.


ఖడ్గం: ఖడ్గానికి తనదైన విచక్షణ ఉండదు. అది చేసేది తప్పా, ఒప్పా అన్నది దాన్ని చేపట్టిన మనిషికే ఉంటుంది. కాబట్టి ఖడ్గాన్ని విచక్షణకు ప్రతిరూపంగా భావించవచ్చు. ఇక ఖడ్గానికి ఉండే పదును, ప్రతి విషయాన్నీ సునిశితంగా పరిశీలించమని చెబుతుంది. కన్నుమూసి తెరిచేలోపల ఖడ్గం చేసే విన్యాసం, చురుకుదనాన్ని సూచిస్తుంది. వాదర ఉన్న కత్తి వేటు పడితే, ఎక్కడికక్కడ తెగి పడాల్సిందే. జీవితంలో మంచిని చెడునీ; ధర్మాన్నీ అధర్మాన్నీ దేనికది నిర్దాక్షిణ్యంగా విడగొట్టుకోమని ఖడ్గం సూచిస్తోంది.



 

శూలం: అమ్మవారిని లలితాసహస్రనామంలో భాగంగా `శూలాద్యాయుధసంపన్నా` అని పిలుస్తారు. శూలం వంటి ఆయుధాలతో విలసిల్లే దేవత అని దీని అర్థం. మహిషాసురునితో ఎన్ని రకాలుగా యుద్ధం చేసినా దుర్గామాత చివరికి శూలంతోనే అతడిని సంహరించింది. గురిచూసి చావు దెబ్బ తీయడానికి (strike/final blow) శూలాన్ని గుర్తుగా భావించవచ్చు. అందుకే ప్రళయకారుడైన రుద్రుడు కూడా త్రిశూలాన్నే ఆయుధంగా అమర్చుకున్నాడు. విజయాన్ని సాధిస్తే దానికి ఇంత తిరుగు ఉండకూడదు అన్న సత్యాన్ని త్రిశూలం చెబుతోంది. బలహీనతలను చావగొడితే అవి మళ్లీ తలెత్తకూడదు అని హెచ్చరిస్తోంది.
 

అభయహస్తం: ఆఖరుదైనా అన్నింటికంటే ముఖ్యమైనది అమ్మవారి అభయహస్తం. మిగతా ఆయుధాలతో మానవప్రయత్నం ఎంతగా చేసినా దైవానుగ్రహం లేనిదే విజయం సాధ్యం కాదనీ చెబుతోంది. అంతేకాదు! మనం చేసే ప్రతి పనికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయనీ, ఒకవేళ పరాజయం పొందినా నిరుత్సాహపడకుండా సాధించేదాకా ప్రయత్నించమనీ అమ్మవారు అభయమిస్తున్నారు.


.....- నిర్జర.